మూడు టీ20 సిరీస్ కోసం భారత పర్యటనకు వచ్చిన అఫ్గానిస్థాన్‌కు బిగ్ షాక్ తగిలింది. సిరీస్ ప్రారంభానికి ముందే ఆ జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ దూరమయ్యాడు. వెన్నెముక గాయం, శస్త్ర చికిత్స కారణంగా గత 6 నెలలుగా రషీద్ ఖాన్ ఆటకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకుంటున్న అతన్ని అఫ్గాన్ క్రికెట్ బోర్డు భారత్‌తో సిరీస్‌కు ఎంపిక చేసింది. అయితే అతను మ్యాచ్ ఆడే ఫిట్‌నెస్ సాధించకపోవడంతో సిరీస్ ప్రారంభానికి ముందే దూరమయ్యాడు.
టీ20 స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రషీద్ ఖాన్ దూరమవడం అఫ్గానిస్థాన్‌కు ఎదురుదెబ్బే. గతేడాది టీ20ల్లో అతను అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. మొత్తం 65 వికెట్లు పడగొట్టాడు. 66 వికెట్లతో ఆస్ట్రేలియా ప్లేయర్ ఎలిస్ అగ్రస్థానంలో ఉన్నాడు.

జట్టుతో భారత పర్యటనకు వచ్చిన రషీద్ ఖాన్ మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించకపోవడంతో స్వదేశం వెళ్లిపోయాడని అఫ్గాన్ కెప్టెన్ ఇబ్రహీమ్ జడ్రాన్ మీడియా సమావేశంలో తెలిపాడు.
'రషీద్ ఖాన్ ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతం అతను రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. అతన్ని ఈ సిరీస్‌లో మేము ఎంతగానో మిస్సవుతాం. రషీద్ గైర్హాజరీలో మేం కొంతమంది ఆటగాళ్లపై నమ్మకం పెట్టుకున్నాం. ఎంతో క్రికెట్ ఆడిన అనుభవం కలిగిన ముజీబ్ ఉన్నాడు. రషీద్ ఖాన్ లేని లోటును అతను తీరుస్తాడని మేం ఆశిస్తున్నాం. టీమిండియాతో వారి సొంతగడ్డపై ఆడటం ఎప్పుడూ కష్టమైన పనే. ఈ సవాల్‌ను ఎదుర్కొనేందుకే మేం ఇక్కడికి వచ్చాం. మా నైపుణ్యం ఎంటో చూపించే ప్రయత్నం చేస్తాం.'అని జడ్రాన్ చెప్పుకొచ్చాడు.
అఫ్గానిస్థాన్‌తో టీమిండియా చాలా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. పసికూనలేనని ఏ మాత్రం తక్కువ అంచనా వేసినా ఘోర పరాజయం ఎదురవుతోంది. వన్డే ప్రపంచకప్‌లో పటిష్టమైన జట్లను అఫ్గాన్ మట్టికరిపించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, మాజీ ఛాంపియన్స్ పాకిస్థాన్, శ్రీలంకపై సంచలన విజయాలు నమోదు చేసింది. ఈ క్రమంలోనే అఫ్గాన్‌తో టీమిండియా ఆచితూచి వ్యవహరించాలి.