ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియాకప్ 2024 టోర్నీలో భాగంగా అఫ్గానిస్థాన్-ఏతో జరుగుతున్న సెమీఫైనల్-2లో టీమిండియా స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ(7), కెప్టెన్ తిలక్ వర్మ(16) దారుణంగా విఫలమయ్యారు. లీగ్ దశలో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన ఈ ఇద్దరూ అసలు సిసలు మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసారు. దాంతో భారత్-ఏ పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్-ఏ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. అఫ్గాన్ ఓపెనర్లు సెదిఖుల్లా అటల్(52 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83), జుబైద్ అక్బారీ(41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. కరీమ్ జనత్(20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో రసిక్ సలామ్(3/25) మూడు వికెట్లు తీయగా.. ఆకిబ్ ఖాన్(1/48) ఒక వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యం చేధనకు దిగిన భారత్-ఏ 48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారీ సిక్సర్‌తో జోరు కనబర్చిన అభిషేక్ శర్మ.. అదే జోరులో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ కాసేపటికే మరో ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్(19) కూడా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ తిలక్ వర్మ మూడు బౌండరీలతో జోరు కనబర్చాడు. కానీ అదే జోరులో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన ఆయుష్ బదోని, నెహాల్ వధేరా ఆచితూచి ఆడుతున్నారు.
అంతకుముందు అఫ్గాన్ బ్యాటర్లు భారత బౌలర్లను చెడుగుడు ఆడారు. ఓపెనర్లు సెదిఖుల్లా అటల్(52 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83), జుబైద్ అక్బారీ(41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64) తొలి వికెట్‌కు 137 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. తర్వాతి బ్యాటర్లు కూడా అదే జోరు కొనసాగించి భారీ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచారు.