ఆసియా కప్ 2025 టోర్నీలో భారత్ చేతిలో పాకిస్థాన్ రెండు సార్లు ఓడిపోవడంపై ఆ దేశ మాజీ ప్రధాని, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ తనదైన శైలిలో స్పందించారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఓపెనర్లుగా బరిలోకి దిగితేనే పాకిస్థాన్ గెలుస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అంతేకాకుండా పాకిస్థాన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఖాజీ ఫాయెజ్ ఇసా, పాకిస్థాన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ సికందర్ సుల్తాన్ రాజా అంపైర్లుగా ఉంటేనే ఇది సాధ్యమవుతుందన్నారు. మూడో అంపైర్‌గా ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సర్ఫరాజ్ డోగర్ అయితే పాక్ విజయానికి డోకా ఉండదని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆసియా కప్ 2025 టోర్నీలో పాక్‌కు ఎదురైన పరాజయాలపై ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఆయన సొందరి అలీమా ఖాన్ మీడియాకు తెలిపారు. గతేడాది ఫిబ్రవరిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) గెలవకుండా అసిమ్ మునీర్ కుట్ర చేశాడని ఆయన ఆరోపించారు.

గత ఆదివారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. అంతకుముందు జరిగిన లీగ్ మ్యాచ్‌లో 7 వికెట్ల తడాతో చిత్తు చేసింది. ఈ రెండు మ్యాచ్‌లు కూడా ఏకపక్షంగానే ముగిసాయి. పాకిస్థాన్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. 1992లో కెప్టెన్‌గా పాకిస్థాన్‌కు ప్రపంచ కప్ అందించిన ఇమ్రాన్ ఖాన్..రాజకీయాల్లోకి వచ్చి ప్రధాని బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే రెండేళ్ల క్రితం ఆయన వివిధ కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు.
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనల నేపథ్యంలో పాకిస్థాన్ ఆటగాళ్లతో భారత క్రికెటర్లు కరచాలనం చేయలేదు. దీనిపై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. భారత కెప్టెన్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వద్దని తమ సారథికి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ చెప్పారని ఆరోపించిన పీసీబీ.. అతన్ని తొలగించాలని, లేకుంటే టోర్నీ నుంచి తప్పుకుంటామని హెచ్చరించింది. ఐసీసీ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.
ఆండీ పైక్రాఫ్ట్ ఎలాంటి తప్పిదం చేయలేదని పేర్కొంది. దాంతో యూఏఈతో మ్యాచ్‌కు ముందు పాక్ టీమ్ బాయ్‌కట్ డ్రామా ఆడింది. ఆ తర్వాత మ్యాచ్ రిఫరీ తమ ఆటగాళ్లకు క్షమాపణలు చెప్పాడని ఓ ప్రకటన చేసింది. అయితే ఈ ప్రకటనను ఐసీసీ ఖండించింది. కానీ పీసీబీ మాత్రం తమ విజయంగా ప్రకటించుకుంది.
భారత్‌తో సూపర్-4 మ్యాచ్‌కు ముందు పీసీబీ ఛైర్మన్ నఖ్వీ.. పాక్ ఆటగాళ్లను కలిసారని, మ్యాచ్ సమయంలో రాజకీయ సందేశాలు ఇవ్వాలని ఆటగాళ్లకు సూచించినట్లు వార్తలు వచ్చాయి. ఈ సూచనల నేపథ్యంలో హారిస్ రౌఫ్ భారత జెట్‌ను నేలకూల్చామని, 6 జెట్ ఫ్లైట్స్‌ను పడగొట్టామని 6-0తో సైగలు చేశాడు. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్ బలగాలు భారత్‌కు చెందిన 6 జెట్ ఫ్లైట్స్‌ను కూల్చినట్లు తప్పుడు ప్రకటన చేశాడు. కానీ ఇందుకు సంబంధించిన ఆధారాలను ఇప్పటి వరకు బయటపెట్టలేదు.