టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. అలనాటి ఆటగాళ్లతో జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో అద్భుత బ్యాటింగ్‌తో సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని భారత జట్టును విజేతగా నిలబెట్టాడు. వెస్టిండీస్ మాస్టర్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో ఇండియా మాస్టర్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐసీసీ టోర్నీ తరహాలోనే మొత్తం 6 జట్లు బరిలో నిలిచాయి.
ఇండియా మాస్టర్స్, శ్రీలంక మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్, ఇంగ్లండ్ మాస్టర్స్, సౌతాఫ్రికా మాస్టర్స్ జట్లు ఈ టోర్నీలో తలపడ్డాయి. ఒకప్పుడు ఆయా దేశాల తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లే ఈ టోర్నీలో బరిలోకి దిగారు. ముఖ్యంగా 1990-2000 మధ్య వెలుగు వెలిగిన ఆటగాళ్లు బరిలోకి దిగడంతో ఆ జనరేషన్ అభిమానులు ఈ టోర్నీని బాగా ఆస్వాదించారు.

సచిన్ సారథ్యంలో..
భారత జట్టును సచిన్ టెండూల్కర్ నడిపించగా.. యువరాజ్ సింగ్, అంబటి రాయుడు,యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, స్టువర్ట్ బిన్నీ, వినయ్ కుమార్‌లు అతని సారథ్యంలో ఆడారు. ఈ టోర్నీలో ఫైనల్‌తో సహా 7 మ్యాచ్‌లు ఆడిన సచిన్ సేన.. ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓటమిపాలైంది. అది కూడా లీగ్ దశలో ఆస్ట్రేలియా మాస్టర్స్ చేతిలో ఓటమిపాలైంది. ఈ పరాజయానికి భారత్.. సెమీస్‌లో బదులు తీర్చుకుంది.
వినయ్ కుమార్ తీన్మార్..
ఓవైపు రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా వరుసగా టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లను గెలిస్తే.. భారత మాజీ క్రికెటర్లు బరిలో నిలిచిన తొలి ఇంటర్నేషనల్ లీగ్ టోర్నీలోనే విజేతగా నిలిచారు. ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మాస్టర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులే చేసింది. సిమ్మన్స్(41 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. డ్వేన్ స్మిత్(35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో వినయ్ కుమార్(3/26) మూడు వికెట్లు తీయగా.. షెహ్‌బాజ్ నదీమ్(2/12) రెండు వికెట్లు పడగొట్టాడు. పవన్ నేగి, స్టువర్ట్ బిన్నీ తలో వికెట్ తీసారు.
రాయుడి విధ్వంసం..
అనంతరం భారత్.. అంబటి రాయుడు(50 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74) సూపర్ బ్యాటింగ్‌తో 17.1 ఓవర్లలోనే 4 వికెట్లకు 149 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ సచిన్ టెండూల్కర్(18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25)తో కలిసి రాయుడు తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించాడు. విజయం ముంగిట అతను ఔటవ్వగా.. యువరాజ్ సింగ్(11 బంతుల్లో ఫోర్‌తో 13 నాటౌట్), స్టువర్ట్ బిన్నీ(9 బంతుల్లో 2 సిక్స్‌లతో 16 నాటౌట్) ఇండియా మాస్టర్స్ విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. భారత్ తరఫున ఐసీసీ టోర్నీ ఆడి కప్ అందించాలనే కలను నేరవేర్చుకోలేకపోయిన రాయుడు.. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ విజయం ద్వారా ఆ కలను కొంతమేర తీర్చుకున్నాడు.