దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐఎల్ టీ20 టోర్నీలో ఇంగ్లండ్ వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఈ టోర్నీలో దుబాయ్ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సామ్ బిల్లింగ్స్.. ఎంఐ ఎమిరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెన్సేషనల్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ తరఫున రెహ్మానుల్లా గుర్బాజ్ వికెట్ కీపింగ్ చేయగా.. సామ్ బిల్లింగ్స్ ఫీల్డింగ్ చేశాడు. స్వతహాగా వికెట్ కీపర్ అయిన సామ్ బిల్లింగ్స్ ఫస్ట్ స్లిప్‌లో అవాక్కయ్యే క్యాచ్ అందుకున్నాడు. తన క్యాచ్‌తో గ్లోవ్స్ లేకుండా స్లిప్‌లో కీపింగ్ చేసినట్లు కనిపించాడు. తన జిమ్నాస్టిక్ నైపుణ్యాన్ని ఉపయోగించుకొని సూపర్ డైవ్‌తో సింగిల్ హ్యాండ్‌తో బంతిని ఒడిసిపట్టుకున్నాడు.

జాసన్ హోల్డర్ వేసిన రెండో ఓవర్‌లో ఈ స్టన్నింగ్ క్యాచ్ ఘటన చోటు చేసుకుంది. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేసిన లెంగ్త్ బాల్‌ను ముంబై బ్యాటర్ విల్ స్మీద్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్‌లో ఉన్న సామ్ బిల్లింగ్స్‌కు దూరంగా దూసుకెళ్లింది. బంతి గమనాన్ని అంచనా వేసిన బిల్లింగ్స్ సూపర్ డైవ్‌తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.
ఈ స్టన్నింగ్ క్యాచ్ చూసి విల్ స్మిత్(5) బిత్తరపోయాడు. నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 'వారెవ్వా వాటే క్యాచ్.. ఇదేం క్యాచ్ రా బాబు.. కళ్లు చెదిరాయి, స్లిప్‌లో వికెట్ కీపింగ్ చేస్తుండా?'అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. ముహమ్మద్ వసీం(51) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. దుబాయ్ క్యాపిటల్స్ బౌలర్లలో జాసన్ హోల్డర్, సికిందర్ రాజా మూడేసి వికెట్లతో సత్తా చాటారు.
అనంతరం దుబాయ్ క్యాపిటల్స్ 16 ఓవర్లలోనే 3 వికెట్లకు 160 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రెహ్మనుల్లా గుర్బాజ్(89) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఎంఐ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మాత్రమే రెండు వికెట్లు తీసాడు.