దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషన్ లీగ్ టీ20 టోర్నీలో తెలుగు తేజం, భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు దారుణంగా విఫలమయ్యాడు. ముంబై ఇండియన్స్‌కు చెందిన ఎంఐ ఎమిరేట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయుడు.. శనివారం దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన కనబర్చాడు.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన రాయుడు 2 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. సికిందర్ రాజా బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఎమిరెట్స్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది.

ముహమ్మద్ వసీం(51) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. దుబాయ్ క్యాపిటల్స్ బౌలర్లలో జాసన్ హోల్డర్, సికిందర్ రాజా మూడేసి వికెట్లతో సత్తా చాటారు. అనంతరం దుబాయ్ క్యాపిటల్స్ 16 ఓవర్లలోనే 3 వికెట్లకు 160 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రెహ్మనుల్లా గుర్బాజ్(89) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఎంఐ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మాత్రమే రెండు వికెట్లు తీసాడు.
ఐపీఎల్ 2023 విజయానంతరం అన్ని రకాల క్రికెట్‌కు రాయుడు గుడ్‌బై చెప్పాడు. ముందస్తు ఒప్పందాల నేపథ్యంలో కరీబియన్ లీగ్(సీపీఎల్) 2023 సీజన్ ఆడాడు. ఈ టోర్నీ అనంతరం రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసిన రాయుడు.. గుంటూరు జిల్లాలో విస్తృత పర్యటన చేశాడు. పొలిటికల్‌పై ప్రాక్టీస్ అనంతరం ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో వైస్సార్‌సీపీ కండువ కప్పుకున్నాడు.
ఏమైందో ఏమో తెలియదు కానీ పట్టుమని 10 రోజులు కూడా రాయుడు రాజకీయాల్లో ఉండలేకపోయాడు. ఆశించిన సీటుపై భరోసా రాకపోవడంతో వైఎస్సార్‌సీపీ పార్టీ నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరగుతుండగా.. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని రాయుడు ట్వీట్ చేశారు. ఆ తర్వాత దుబాయ్ వేదికగా జరగనున్న ఐఎల్ టీ20 టోర్నీలో బరిలోకి దిగుతున్నానని, ప్రొఫెషనల్ క్రికెట్ ఆడేటప్పుడు ఏ రాజకీయ పార్టీలో ఉండకూడదని, అందుకే దూరంగా ఉంటున్నానని చెప్పాడు.
ఈ ట్వీట్ చేసిన 24 గంటల వ్యవధిలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో రాయుడు సమావేశం అయ్యాడు. ఆ పార్టీ పట్ల సానుకూల వైఖరి వ్యక్తం చేసిన రాయుడు.. తన ఆశయాలు జనసేన సిద్దాంతలు ఒకేలా ఉన్నాయని తెలిపాడు. ఐఎల్ టీ20 ముగిసిన అనంతరం జనసేన కండువా కప్పుకునే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలతో క్రికెట్ కెరీర్‌ను నాశనం చేసుకున్న రాయుడు.. రాజకీయాల్లోనూ అదే దూకుడు కనబరుస్తున్నాడు.
రాజకీయాల్లో చేరిన 10 రోజులకే యూటర్న్ తీసుకొని మళ్లీ బ్యాట్ పట్టిన రాయుడు.. ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు.