
సౌతాంప్టన్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరల్ట్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్‌కు టైమ్ దగ్గరపడింది. భారత్, న్యూజిలాండ్ మధ్య మరికొద్ది గంటల్లో ఈ మెగా సమరానికి తెరలేవనుంది. ఫస్ట్ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ కావడం, టైటిల్ కోసం రెండు బలమైన జట్లు తలపడుతుండటంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తినెలకొంది. తొలి ఐసీసీ ట్రోఫీని అందుకోవాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లక్ష్యంగా పెట్టుకోగా.. ఫైనల్ మ్యాచ్‌ల్లో తమ అలవాటుగా మారిన తడబాటుకు బ్రేక్ వేయాలని కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ భావిస్తున్నాడు. ఏదేమైనా హోరాహోరీ తప్పదనిపిస్తున్న ఈ మెగా మ్యాచ్‌లో విజేత ఎవరనేది తేలాలంటే కాస్త ఓపిక పట్టాల్సిందే.
అయితే ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే లెక్కకు మించిన విశ్లేషణలు జరిగాయి. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ గెలవడంతో పాటు ఆటగాళ్లకు కావాల్సిన మ్యాచ్ ప్రాక్టీస్ లభించడంతో పరిస్థితులన్నీ న్యూజిలాండ్‌కు అనుకూలంగా ఉన్నాయని తెలుస్తున్నా.. కోహ్లీసేనను తక్కువ అంచనా వేయడానికి లేదని భారత అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే భారత్‌కు అనుకూలంగా ఉన్న ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఐసీసీ ఈవెంట్లలో కివీస్‌పై మెరుగైన రికార్డు లేకున్నా.. మెగా ఫైనల్స్ కోహ్లీకి కలిసిరాకున్నా.. ఓ సెంటిమెంట్ మాత్రం భారత అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తోంది.
అదేంటంటే.. టీమిండియా స్టార్ ఓపెనర్, లక్కీ ప్లేయర్ రోహిత్ శర్మ బ్యాటింగ్. అవును హిట్ మ్యాన్ టెస్ట్‌ల్లో సెంచరీ చేసినా.. ఔటవ్వకుండా అజేయంగా నిలిచినా.. సహచర బ్యాట్స్‌మన్‌తో కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పినా.. కనీసం రెండు సిక్స్‌లు కొట్టినా భారత్ ఓటమి నుంచి గట్టెక్కినట్లే. ఇప్పటి వరకు ఈ ముంబైకర్ భారత్ తరఫున 38 టెస్ట్‌లు ఆడగా.. వీటిన్నింటిలో అతను ఆడిన ప్రతీసారి భారత్ గెలవడమో.. కనీసం డ్రా చేసుకోవడమో జరిగింది. దాంతో ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ కనీసం రెండు సిక్స్‌లు అయినా కొట్టాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక రెండేళ్ల క్రితమే సుదీర్ఘ ఫార్మాట్‌లో ఓపెనర్‌గా అవతారమెత్తిన రోహిత్ దుమ్మురేపాడు. స్వదేశంలో జరిగిన సిరీస్‌ల్లో సెహ్వాగ్ స్టైల్లో సెంచరీల మోత మోగించాడు. ఇప్పటి వరకు 46.7 సగటుతో 2615 రన్స్ చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీ, ఒక డబుల్ సెంచరీ ఉంది. ఇంగ్లండ్‌లో ఇప్పటి వరకు ఒకే ఒక టెస్ట్ ఆడిన హిట్ మ్యాన్.. ఈసారి తన సత్తా ఏంటో చూపించాలనుకుంటున్నారు. తాను స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా రాణించగలనని క్రికెట్ ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాడు.