
కోహ్లీ నమ్మిన బంటుగా..
కెప్టెన్ విరాట్ కోహ్లీ నమ్మినబంటుగా. బంతి చేతికిస్తే చాలు అద్భుతాలు చేయగలడని నిరూపిస్తున్నాడు. విమర్శకులకు తన పదునైన బౌలింగ్‌తోనే సమాధానమిస్తూ ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ వెన్నులో వణుకు పుట్టించాడు. క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్‌లో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు.చురకత్తుల్లాంటి బంతులతో ఇంగ్లిష్ జట్టు పతనాన్ని శాసించిన సిరాజ్..భారత బౌలింగ్ అమ్ములపొదిలో ప్రధానాస్త్రంగా మారాడు.
షమీ, ఇషాంత్, బుమ్రా లాంటి సీనియర్లతో పోటీపడుతూ చెలరేగుతున్నాడు. పరిస్థితులకు అనుగుణంగా స్వింగ్ రాబడుతూ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో కీలకమయ్యాడు. వేగంలో వైవిధ్యం ప్రదర్శిస్తూ ఇన్ స్వింగర్లు, ఔట్ స్వింగర్లు, స్లో బంతులతో బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టిస్తున్నాడు.

నయా సిరాజ్..
ఆస్ట్రేలియాపై గతేడాది బాక్సింగ్ డే టెస్టులో అరంగేట్రం చేసినప్పటి నుంచి తాజాగా ఇంగ్లండ్‌తో ముగిసిన లార్డ్స్ టెస్టు వరకు సిరాజ్ మ్యాచ్ మ్యాచ్‌కు ఎంతో పరిణతి సాధించాడు. నిలకడైన వేగానికి అద్భుతమైన స్వింగ్ జోడిస్తూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. కోహ్లీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయని ఈ హైదరాబాదీ.. వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థిని చావుదెబ్బ కొడుతున్నాడు.
అలుపుసొలుపు అన్నది లేకుండా బౌలింగ్ చేసే సిరాజ్..టీమిండియా చిరస్మరణీయ విజయాల్లో కీలక భూమిక అవుతున్నాడు. ఆస్ట్రేలియాతో చరిత్రాత్మక టెస్టు సిరీస్ విజయంతో పాటు సొంత ఇలాఖాలో ఇంగ్లండ్‌ను మట్టికరిపించడం, ఆ తర్వాత ఇప్పుడు ఇంగ్లీష్ గడ్డపై ఇరుగదీస్తుండటం వరకు సిరాజ్ మానియా కొనసాగుతున్నది.

రెండు సార్లు హ్యాట్రిక్ చాన్స్
లార్డ్స్ మ్యాచ్ విషయానికొస్తే తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో అదరగొట్టిన సిరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఆఖర్లో క్రీజులో పాతుకుపోయి భారత విజయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన మొయిన్ అలీని అద్భుత బంతితో సిరాజ్ ఔట్ చేసిన తీరు నభూతో నభవిష్యత్. ఆ మరుసటి బంతికే సామ్ కరాన్‌ను పెవిలియన్ పంపి భారత్ శిబిరాన్ని ఆనందంలో ముంచెత్తాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వరుస బంతుల్లో వికెట్లు తీసి హ్యాట్రిక్ చాన్స్ అందుకోవడం విశేషం.

గప్‌చుప్ సెలెబ్రేషన్స్‌తో..
మరో వైపు బుమ్రా, షమీ, ఇషాంత్ వికెట్ల వేట కొనసాగిస్తున్న క్రమంలో కోహ్లీ.. అదునుచూసి సిరాజ్‌ను ప్రయోగించడం మ్యాచ్‌ను మలుపు తిప్పిందని చెప్పొచ్చు. కొరకరాని కొయ్యగా మారిన బట్లర్‌ను సాగనంపిన ఈ హైదరాబాదీ.. అండర్సన్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి ఔరా అనిపించాడు. టెస్టుల్లో ఆరువందలకు పైగా వికెట్లు పడగొట్టిన అండర్సన్‌కు తాను ఎలా ఔటయ్యానో అర్థం చేసుకునే సమయం పట్టిందంటే సిరాజ్ ప్రతిభ ఎట్లా ఉందో అర్థమవుతుంది. వికెట్ పడగొట్టిన తర్వాత నోటికి అడ్డంగా వేలు పెట్టుకుని సిరాజ్ చేస్తున్న సింహనాదం విమర్శకులకు ఘాటైన సమాధానంగా మారింది.

డబ్ల్యూటీసీ ఫైనల్లో ఉంటే..
వాస్తవానికి న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీ ఫైనల్లో భారత్ తుది జట్టు ఎంపికలోనే తప్పు చేసి మూల్యం చెల్లించుకుంది. ఇంగ్లండ్ పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోకుండా బెస్ట్ ఎలెవన్ టీమ్ అంటూ ముందుగానే ప్రకటించి అత్యుత్సాహం ప్రదర్శించింది. తీరా మ్యాచ్‌లో అదనపు పేసర్ లేక తీవ్ర ఇబ్బంది పడింది.
స్వింగ్ కండిషన్స్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసే సిరాజ్‌ను ఆ మ్యాచ్‌లో తీసుకొని ఉంటే ఖచ్చితంగా లార్డ్స్ టెస్ట్ ఫలితమే వచ్చేది. సిరాజే కాకుండా స్వింగ్ కండిషన్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసే కేఎల్ రాహుల్‌ను సైతం భారత్ తీసుకోవాల్సింది. ఇప్పటికైనా తప్పులను తెలుసుకున్న కోహ్లీసేన.. వాటిని సరిదిద్దుకొని విజయాల బాట పట్టింది.

చారిత్రాత్మక విజయం
181/6 ఓవర్ నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను కొనసాగించిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 298/8 వద్ద డిక్లేర్ చేసింది. మహమ్మద్ షమీ(70 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56 నాటౌట్), జస్‌ప్రీత్ బుమ్రా(53 బంతుల్లో 2 ఫోర్లతో 36 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్‌తో 9వ వికెట్‌కు అజేయంగా 89 పరుగులు జోడించారు. దాంతో భారత్‌కు 271 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 51.5 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. జోస్ బట్లర్(96 బంతుల్లో 25), జోరూట్(60 బంతుల్లో 33) పోరాడినా ఫలితం లేకపోయింది.
భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(4/32) నాలుగు వికెట్లతో చెలరేగగా.. జస్‌ప్రీత్ బుమ్రా(3/33) మూడు, ఇషాంత్ శర్మ(2/13) రెండు వికెట్లు తీశారు. మహమ్మద్ షమీ(1/13)కి ఒక వికెట్ దక్కింది. ఈ విజయంతో ఐదు టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-0తో బోణీ కొట్టింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ ఆగస్టు 25న(బుధవారం) లీడ్స్ వేదికగా జరగనుంది.


Click it and Unblock the Notifications












