టీ20 ప్రపంచకప్ 2024లో హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8కు అర్హత సాధించిన టీమిండియా.. అదే జోరులో లీగ్ దశను ముగించాలనుకుంది. కానీ కెనడాతో శనివారం జరగాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా బంతి పడకుండానే రద్దయ్యింది. భారీ వర్షంతో మైదానం మొత్తం చిత్తడిగా మారడంతో పలు మార్లు గ్రౌండ్‌ను పరిశీలించిన అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
దాంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ లభించగా.. గ్రూప్-ఏ టాపర్‌గా టీమిండియా సూపర్-8లోకి అడుగుపెట్టింది. గ్రూప్ బీ రన్నరప్‌గా ఆతిథ్య అమెరికా టోర్నీలో ముందడుగు వేసింది. అయితే కెనడాతో జరగాల్సిన మ్యాచ్ రద్దవ్వడం టీమిండియాకు కలిసొచ్చే అంశమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినప్పుడు విజేతగా నిలిచిందని గుర్తు చేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచింది. అప్పటి నుంచి టీమిండియా మరో టైటిల్ అందుకోలేదు.
2007 టీ20 ప్రపంచకప్ సంబంధించిన చాలా విషయాలు.. తాజా టోర్నీలో రిపీట్ అయ్యాయని, ఈసారి కూడా భారత్‌తే విజయమని కామెంట్ చేస్తున్నారు. అరంగేట్ర టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌తో జరగాల్సిన భారత మ్యాచ్ వర్షం కారణంగా బంతి పడకుండానే రద్దయ్యింది.
అంతేకాకుండా 2007 టీ20 ప్రపంచకప్‌లో శ్రీశాంత్ రూపంలో కేరళ ఆటగాడున్నాడని, తాజా టోర్నీలో సంజూ శాంసన్ భాగమయ్యాడని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. అప్పుడు, ఇప్పుడు ఆతిథ్య దేశం తొలి మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. పాకిస్థాన్ టై అయిన తర్వాత ఆ జట్టు ఓటమిపాలైంది. ఆతిథ్య దేశంపై భారత లెఫ్టార్మ్ పేసర్లు 4 వికెట్ల ఘనతను అందుకున్నారు.
అప్పుడు జహీర్ ఖాన్ అయితే ఇప్పుడు అర్ష్‌దీప్ సింగ్ ఈ ఫీట్ సాధించారు. రెండు సందర్భాల్లో భారత్.. పాకిస్థాన్‌ను డిఫెండింగ్‌లోనే ఓడించింది. అనామక జట్టుతో భారత మ్యాచ్‌లు రద్దయ్యాయి. అన్నింటికి మించీ అప్పుడు ఇప్పుడు వన్డే, టెస్ట్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా జట్టే.
సూపర్ 8లో టీమిండియాకు గట్టి పోటీనే లేదు. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాతో భారత్ తలపడాల్సి ఉంది. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియాను ఓడిస్తే సునాయసంగా సెమీస్ చేరుతోంది.
టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో భారత్ షెడ్యూల్
జూన్ 20: భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్- బార్బడోస్ (రాత్రి 8 గంటలకు)
జూన్ 22: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్- ఆంటిగ్వా (రాత్రి 8 గంటలకు)
జూన్ 24: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా- లూసియా (రాత్రి 8 గంటలకు)