
దుబాయ్: కరోనా వైరస్ కారణంగా యావత్ క్రీడా ప్రపంచం స్థంభించింది. ఇప్పటికే క్రీడా టోర్నీలన్నీ రద్దవడమో లేదా వాయిదాపడటమో జరుగుతుంది. క్రికెట్ టోర్నీలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరులో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉంది.
కానీ కరోనా వైరస్ కారణంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం సెప్టెంబరు 30 వరకు పర్యాటక వీసాల్ని రద్దు చేసింది. ఒకవేళ అప్పుడు కూడా పరిస్థితులు అదుపులోకి రాకపోతే.. ఆ ఆంక్షల్ని మరింతగా పొడిగించే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించాలా.. లేక వాయిదా వేయాలా అనేదానిపై ఐసీసీ ఓ నిర్ణయానికి రాలేకపతుంది.
టీ20 ప్రపంచకప్‌కు ఇంకా ఆరు నెలలు సమయం ఉండటంతో ఐసీసీ వేచిచూసే ధోరణిలో ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ఐసీసీ అధికార ప్రతినిధి ఒకరు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టులో టోర్నీ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. 'యావత్ ప్రపంచం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ప్రజల ఆరోగ్యమే తొలి ప్రాధాన్యత. అయితే ప్రస్థుత పరిస్థితులను బట్టి ఈ మెగాటోర్నీ ఇప్పుడే వాయిదా వేస్తే.. వచ్చే రెండు, మూడు నెలల్లో పరిస్థితులు మెరుగైతే ఏం చేయలేం. ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఆగస్టు వరకు వేచి చూడాల్సిందే. అప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోం. కాబట్టి.. అప్పటి వరకూ టీ20 వరల్డ్‌కప్ నిర్వహణపై ఎలాంటి అప్ డేట్ ఆశించవద్దు'అని ఆ ఐసీసీ అధికారి తెలిపారు. ఇక టీ20 వరల్డ్‌కప్ వాయిదాపడితే.. అక్టోబరు- నవంబరు మధ్యకాలంలో ఐపీఎల్ 2020 సీజన్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.
ఇక ఈ గురువారం ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(సీఈసీ) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానుంది. క్రికెట్ భవిష్యత్తు ప్రణాళిక(ఎఫ్‌టీపీ)ని రివైజ్ చేసే అంశంపై చర్చించనుంది.