పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ మోహ్‌సిన్ నఖ్వీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పాకిస్థాన్ కూడా బంగ్లాదేశ్ బాటలోనే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 నుంచి తప్పుకుంటే ఆ దేశ క్రికెట్ బోర్డుపై తీవ్ర ఆంక్షలు విధించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఓ ఇంగ్లీష్ పత్రిక తమ కథనంలో పేర్కొంది.
పాకిస్థాన్‌తో ఏ దేశం ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకుండా నిషేధం విధించడం, పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో ఆడే విదేశీ ఆటగాళ్లకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లను తిరస్కరించడం, ఆసియా కప్ నుంచి బహిష్కరించడం వంటి కఠినమైన చర్యలను ఐసీసీ తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.ఈ విషయమై ఇప్పటికే పీసీబీకి ఐసీసీ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఐసీసీ రూల్స్ ప్రకారం క్రికెట్ బోర్డుల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు. అలా ఉందని ఐసీసీ భావిస్తే.. ఆ దేశ క్రికెట్ బోర్డులపై నిషేధం విధించే హక్కు ఐసీసీకి ఉంటుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై ఐసీసీ నిషేధం విధిస్తే ఆ దేశ క్రికెట్ నాశనమవుతుంది. ఇప్పటికే పీసీబీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఐసీసీ నుంచి వచ్చే వాటాపైనే ఆధారపడి పనిచేస్తోంది. అయితే బంగ్లాదేశ్ తరహాలో తప్పుకునే దైర్యం పాకిస్థాన్‌కు లేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఐసీసీ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంపై నఖ్వీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్‌కు ఐసీసీ అన్యాయం చేసిందని, భారత్ చెప్పినట్లు నడుస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 'బంగ్లాదేశ్ ఐసీసీలో కీలక సభ్య దేశం. వారితో అన్యాయంగా వ్యవహరించారు. బుధవారం ఐసీసీ సమావేశంలో కూడా నేను ఇదే చెప్పా. భారత్‌కు బంగ్లా జట్టు పంపకూడదన్న నిర్ణయం వెనుక చాలా కారణాలు ఉన్నాయి.
ఇక్కడ ఒక దేశం(భారత్) అన్నింటినీ శాసిస్తోంది. గతంలో భారత్, పాకిస్థాన్‌ల కోసం ఐసీసీ వేదికలను మార్చినప్పుడు.. బంగ్లాదేశ్ కోసం అలా ఎందుకు చేయరు.'అని నఖ్వీ ప్రశ్నించాడు. అంతేకాకుండా ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ పాల్గొనే విషయం తమ ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉందని తెలిపాడు. దాంతో పాక్ కూడా టోర్నీ నుంచి తప్పుకుంటుందనే ప్రచారం ఊపందుకుంది.