టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా తమ మ్యాచ్‌లను భారత్ నుంచి తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. భారత్‌లో ఆడండి లేదంటే పాయింట్స్ కోల్పోతారని ఐసీసీ హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 7 నుంచి 8 వరకు భారత్, శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ముందస్తు ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్ మ్యాచ్‌లు శ్రీలంక వేదికగా జరగనున్నాయి. గ్రూప్ సీలో ఉన్న బంగ్లాదేశ్ కోల్‌కతా, ముంబై వేదికగా తమ లీగ్ మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో భారత్‌లో ఆడటం తమ ఆటగాళ్లకు సురక్షితం కాదని, తమ మ్యాచ్‌లను భారత్ నుంచి తరలించాలని అభ్యర్థించింది.

అయితే ఈ విన్నపాన్ని ఐసీసీ తిరస్కరించినట్లు ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్‌ఫో పేర్కొంది. 'ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం వారు భారత్‌కు వెళ్లాలి. అలా చేయకపోతే ఆ మ్యాచ్‌లకు పాయింట్స్ కోల్పోతారు.' అని మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ఐసీసీ హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఖండించింది. ఐసీసీ నుంచి తమకు ఎలాంటి హెచ్చరిక జారీ కాలేదని స్పష్టం చేసింది.
ముస్తాఫిజుర్ రెహ్మాన్‌పై వేటు వేయడం ఈ వివాదానికి దారి తీసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆ దేశ ఆటగాళ్లను ఐపీఎల్ నుంచి బహిష్కరించాలనే డిమాండ్ నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ ఆదేశాలతో ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్ వదిలేసింది. ఈ చర్యతో బంగ్లాదేశ్ ప్రభుత్వంతో పాటు ఆ దేశ క్రికెట్ బోర్డు ఆగ్రహానికి గురైంది. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించడంతో పాటు తమ ప్రపంచకప్ మ్యాచ్‌లను భారత్ నుంచి తరలించాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చింది.
ఫిబ్రవరి 7: బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్- కోల్‌కతా
ఫిబ్రవరి 9: బంగ్లాదేశ్ వర్సెస్ ఇటలీ-కోల్‌కతా
ఫిబ్రవరి 14: బంగ్లాదేశ్ వర్సెస్ ఇంగ్లండ్-కోల్‌కతా
ఫిబ్రవరి 17: బంగ్లాదేశ్ వర్సెస్ నేపాల్: ముంబై