ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దుమ్మురేపాడు. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో రోహిత్ ఒకస్థానం మెరుగుపరుచుకొని ఐదో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం వన్డే, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్-5లో ఉన్న ఏకైక బ్యాటర్ రోహిత్ శర్మనే కావడం విశేషం.
యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ ఒక్కో స్థానాన్ని మెరుగుపరుచుకొని ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోరూట్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంకతో జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌లో అతను దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఇక మూడో టెస్ట్‌లో అజేయ శతకంతో శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించిన పాతుమ్ నిస్సంక ఏకంగా 42 స్థానాలు ఎగబాకి 39వ స్థానంలో నిలిచాడు.

న్యూజిలాండ్ బ్యాటర్లు కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా స్టార్‌బ్యాటర్ స్టీవ్ స్మిత్ నాలుగో స్థానంలో నిలిచాడు.
బౌలింగ్ విభాగం ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు జరగలేదు. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హజెల్‌వుడ్‌తో కలిసి బుమ్రా రెండో స్థానంలో నిలవగా.. రవీంద్ర జడేజా ఏడో స్థానంలో ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ 15వ స్థానంలో కొనసాగుతున్నాడు.
గత 6 నెలలుగా టీమిండియా టెస్ట్ ఫార్మాట్ ఆడలేదు. అయినా భారత ఆటగాళ్లు టాప్-10లో తమ ర్యాంకులను పదిలంగా ఉంచుకున్నారు. బంగ్లాదేశ్‌తో సెప్టెంబర్ 19 నుంచి సొంతగడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ అనంతరం భారత ఆటగాళ్లు మెరుగైన ర్యాంక్స్ సాధించే అవకాశం ఉంది.
ఇప్పటికే ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును భారత సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. సుదీర్ఘ విరామం తర్వాత రిషభ్ పంత్ బరిలోకి దిగుతున్నాడు. తొలి టెస్ట్ సెప్టెంబర్ 19 నుంచి 23 వరకు చెన్నై వేదికగా జరగనుండగా.. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు రెండో టెస్ట్ జరగనుంది.