
దుబాయ్: టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ టెస్టుల్లో కెరీర్ అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన బౌలింగ్ జాబితాలో అక్షర్ 20 స్థానాలు మెరుగై 18వ ర్యాంకులో నిలిచాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో 5 వికెట్లు తీసిన అక్షర్.. 650 పాయింట్లతో టాప్-20 ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో సత్తాచాటి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు సొంతం చేసుకున్న కుల్దీప్‌యాదవ్ 19 స్థానాలు మెరుగై 49వ ర్యాంకు సాధించాడు.
స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా 4, రవిచంద్రన్ అశ్విన్ 5వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. బ్యాటింగ్‌లో చతేశ్వర్ పుజారా 10 స్థానాలు మెరుగై 16వ ర్యాంకు చేరుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ 11 స్థానాలు మెరుగై 26వ ర్యాంకు దక్కించుకున్నాడు. రిషభ్ పంత్ 6, రోహిత్‌శర్మ 9, విరాట్ కోహ్లి 12వ స్థానాలకు పడిపోయారు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు రోహిత్ శర్మ దూరంగా ఉండగా.. విరాట్ కోహ్లీ తొలి టెస్ట్‌లో నిరాశ పరిచాడు.
బంగ్లాదేశ్‌ను తొలి టెస్టులో చిత్తుగా ఓడించిన ఉత్సాహంలో చివరిదైన రెండో టెస్టును కూడా నెగ్గి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని టీమిండియా చూస్తోంది. గురువారం మీర్‌పూర్‌లో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. బంగ్లాపై తొలి టెస్టులో విజయం సాధించడం, అదే సమయంలో ఆస్ట్రేలియా చేతిలో దక్షిణాఫ్రికా పరాజయం పాలవడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో సఫారీ జట్టును వెనక్కి నెట్టి భారత్ రెండో స్థానానికి ఎగబాకింది.
అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్ తన చివరి టెస్టు సిరీస్‌ను సొంతగడ్డపై ఆడబోతోంది. ఆ సిరీస్‌లోనూ గెలిస్తేనే ఫైనల్ బెర్తు దక్కుతుంది కానీ.. అంతకంటే ముందు బంగ్లాపై టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం భారత్‌కు అవసరం. అలా కాని పక్షంలో భారత్ అవకాశాలు ప్రమాదంలో పడతాయి. కాబట్టి రెండో టెస్టులో ఉదాసీనతకు అవకాశమే ఇవ్వకూడదు.