
దుబాయ్: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకుల్లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి దుమ్మురేపాడు. ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సూర్య(25 బంతుల్లో 46) ఒకస్థానాన్ని మెరుగుపరుచుకొని మూడో ర్యాంకులో నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ ఆజామ్‌ను వెనక్కు నెట్టాడు. కొద్దిరోజుల క్రితం కెరీర్ అత్యుత్తమంగా 2వ ర్యాంకు సాధించిన సూర్య.. ఆసియా కప్‌లో పేలవ ప్రదర్శనతో 4వ స్థానానికి పడిపోయాడు. తాజా ప్రదర్శనతో మళ్లీ మూడో ర్యాంకు అందుకున్నాడు. ప్రస్తుతం సూర్య 780పాయింట్లతో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో చాలా రోజుల వరకు మొదటి స్థానంలో ఉన్న బాబర్ ఈ మధ్యకాలంలో రాణించలేకపోవడంతో అతని ర్యాంకు పడిపోతూ వస్తోంది.
ఇక పాక్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్(825) నం.1 ర్యాంకును నిలబెట్టుకున్నాడు. సౌతాఫ్రికాకు చెందిన మార్‌క్రమ్(792) 2వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలన్, ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ 5, 6 స్థానాల్లో ఉన్నారు. ఇక మరే ఇతర భారత బ్యాటర్ కూడా టాప్-10లో లేరు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ 14, 16, 18వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.
ఐపీఎల్ 2022 లో చూపించిన ఫామ్‌ను కొనసాగిస్తూ.. భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య దుమ్మురేపుతున్నాడు. ముఖ్యంగా మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వీరవిహారం చేయడంతో ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్-5లోకి దూసుకొచ్చాడు. రెండు స్థానాలు ఎగబాకి 180 ర్యాంకింగ్ పాయింట్లతో ఐదో స్థానానికి చేరుకున్నాడు. షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), మహమ్మద్ నబి (అఫ్గానిస్థాన్) ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో నిలిచారు.
అయితే బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ రెండు స్థానాలు పడిపోయి 9వ స్థానంలో నిలిచాడు. మరే ఇతర భారత బౌలర్ కూడా టాప్-10లో చోటు సంపాదించలేకపోయారు. జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా), తబ్రిజ్ షంసి (దక్షిణాఫ్రికా) మొదటి రెండు స్థానాలను దక్కించుకున్నారు.