
దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమైన విరాట్ కోహ్లీ ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు దిగజారాడు. ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 68 పరుగులు మాత్రమే చేసిన విరాట్ నాలుగో స్థానం నుంచి 8వ ర్యాంకుకు పడిపోయాడు. పాకిస్థాన్‌పై హాఫ్ సెంచరీ బాదిన విరాట్.. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో విఫలమయ్యాడు. చివరి మూడు మ్యాచ్‌ల్లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇది అతని టీ20 ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపింది.
టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన ఈ ఇద్దరూ.. చిన్నదేశాలపై చితక్కొట్టారు. రాహుల్ మూడు అర్ధశతకాలతో చెలరేగి ఈ టోర్నీలో అత్యధిక పరుగులు (194) చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ప్రదర్శనతో టీ20 ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు. ఇక కొత్త సారథి రోహిత్ శర్మ రెండు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకుకు చేరుకున్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 839 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. 800 పాయింట్లతో ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలన్ రెండో స్థానంలో ఉన్నాడు. సౌతాఫ్రికా ప్లేయర్ మార్‌క్రమ్ మూడు స్థానాలు ఎగబాకి 796 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు.
ఆల్‌రౌండర్ల జాబితాలో అఫ్గానిస్థాన్ కెప్టెన్ మహ్మద్ నబీ అగ్రస్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. మరోవైపు, శ్రీలంక ఆటగాడు వానిందు హసరంగ మూడో స్థానంలో నిలిచి కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకును అందుకున్నాడు. ఈ జాబితాలోని టాప్-10లో టీమిండియా ఆటగాళ్లు ఒక్కరు కూడా నిలవకపోవడం గమనార్హం. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లోనూ టాప్-10లో ఒక్క భారత బౌలర్ కూడా లేడు.