ICC T20 Rankings: ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు దుమ్మురేపారు. టీమిండియా తాత్కలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగా.. నయా హిట్టర్ రింకూ సింగ్ ర్యాంకింగ్స్‌లోకి దూసుకొచ్చాడు. సౌతాఫ్రికాతో మంగళవారం జరిగిన రెండో టీ20లో సూర్య, రింకూ సింగ్ హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన విషయం తెలిసిందే.
ఈ ఇన్నింగ్స్‌లతో ఈ ఇద్దరూ తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకున్నారు. ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న సూర్య రేటింగ్ పాయింట్స్‌ను పెంచుకొని సమీప ప్రత్యర్థులకు అందనంత ఎత్తుకు వెళ్లిపోయాడు. ప్రస్తుతం సూర్య ఖాతాలో 865 రేటింగ్ పాయింట్స్ ఉండగా.. రెండో స్థానంలో ఉన్న మహమ్మద్ రిజ్వాన్ ఖాతాలో 787 పాయింట్స్ ఉన్నాయి.

ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసం 78 పాయింట్స్‌గా ఉంది. ఈ ఇద్దరి తర్వాత ఎయిడెన్ మార్క్‌రమ్(785), బాబర్ ఆజామ్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తన ఏడో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. అనారోగ్యం కారణంగా అతను సౌతాఫ్రికాతో రెండో టీ20 ఆడలేదు.
మరోవైపు మెరుపు హాఫ్ సెంచరీతో సత్తా చాటిన రింకూ సింగ్ 46 స్థానాలు ఎగబాకి 59వ ర్యాంక్ అందుకున్నాడు. తెలుగు తేజం తిలక్ వర్మ 10 స్థానాలు మెరుగుపర్చుకొని 55వ స్థానంలో నిలిచాడు.
బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సౌతాఫ్రికాతో రెండో టీ20లో ఆడే అవకాశం దక్కకపోయినా.. అతని ర్యాంక్‌లో మార్పు రాలేదు. ప్రస్తుతం అతని టాప్ ర్యాంక్ కాపాడుకున్నప్పటికీ.. అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రూపంలో అతనికి ప్రమాదం పొంచి ఉంది.
ప్రస్తుతం ఈ ఇద్దరూ 692 రేటింగ్ పాయింట్లతో సమంగా ఉన్నారు. బౌలింగ్ ర్యాకింగ్స్‌లో టాప్-10లో రవి బిష్ణోయ్ మినహా మరే బౌలర్ లేడు. హసరంగా, ఆదిల్ రషీద్, తీక్షణ, సామ్ కర్రన్, ఫజల్ హక్ ఫారూకీ, ముజీబ్ రెహ్మాన్, అకీల్ హోసెన్, టబ్రైజ్ షంసీ వరుసగా 3 నుంచి 10 స్థానాల్లో నిలిచారు.