టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. టీ20 ప్రపంచకప్ 2024 విజయంతో ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ అనంతరం ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ విడుదల చేయగా.. రెండు స్థానాలు మెరుగుపరుచుకున్న హార్దిక్ పాండ్యా.. శ్రీలంక ఆల్‌రౌండర్ వానిందు హసరంగాతో కలిసి టాప్ ర్యాంక్‌లో నిలిచాడు.
ఈ ఇద్దరూ 222 రేటింగ్ పాయింట్స్‌తో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ఈ టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ పాండ్యా 11 వికెట్లు తీయడంతో పాటు 144 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో మూడు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతోనే హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

మార్కస్ స్టోయినీస్, సికిందర్ రాజా, షకీబ్ అల్ హసన్ టాప్-5లో కొనసాగుతున్నారు. మరే భారత ఆల్‌రౌండర్ కూడా టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయారు. బౌలింగ్ విభాగంలో అక్షర్ పటేల్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని ఏడో స్థానంలో నిలవగా.. కుల్దీప్ యాదవ్ మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 9వ ర్యాంక్ అందుకున్నాడు.
ఈ టోర్నీలో 17 వికెట్లు తీసిన జస్‌ప్రీత్ బుమ్రా 12 స్థానాలను మెరుగుపరుచుకొని 12వ స్థానంలో నిలిచాడు. వరల్డ్ బెస్ట్ పేసర్ అయిన బుమ్రా గతేడాదిగా టీ20లకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. బ్యాటింగ్ విభాగంలో సూర్యకుమార్ యాదవ్ తన రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకోగా.. యశస్వి జైస్వాల్ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. సెమీఫైనల్, ఫైనల్లో సూర్య విఫలమవడంతో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ట్రావిస్ హెడ్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.
ఇటీవల ఐసీసీ ప్రకటించిన టోర్నీ ఆఫ్ ది టీమ్‌లో భారత్ నుంచి ఆరుగురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఐసీసీ టోర్నీ ఆఫ్ ది టీమ్‌లో చోటు దక్కించుకున్నారు.