ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన హైఓల్టేజ్ మ్యాచ్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పెట్టిన 5 డిమాండ్లలో మూడింటిని ఐసీసీ తిరస్కరించింది. ముఖ్యంగా భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ల పునరుద్దరణ, భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య ట్రై సిరీస్ నిర్వహించాలనే డిమాండ్లను ఐసీసీ తోసిపుచ్చింది.
పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడాలని బీసీసీఐని ఆదేశించే అధికారం తమకు లేదని, ఈ అంశం తమ పరిధిలో లేదని పీసీబీకి ఐసీసీ తేల్చి చెప్పింది. బీసీసీఐకి మాత్రమే ఈ అధికారం ఉందని, భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బీసీసీఐ నడుచుకుంటుందని పీసీబీకి ఐసీసీ స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్, పాక్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పీసీబీతో ఐసీసీ చర్చలు జరిపింది. లాహోర్‌లో ఆదివారం పీసీబీ ఛైర్మన్ మోహిసిన్ నఖ్వీతో ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ అమీనుల్ ఇస్లాం సమావేశమయ్యారు.

ఐదు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో ఐసీసీ ముందు పాకిస్థాన్ ఐదు డిమాండ్లు పెట్టింది. అలాగే బంగ్లాదేశ్‌కు పూర్తి రెవెన్యూ ఇవ్వడం, వారికి భవిష్యత్ ఐసీసీ టోర్నమెంట్ కేటాయించడంతో పాటు వారిపై చర్యలు తీసుకోవద్దని, పార్టిసిపేషన్ ఫీజు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ రెండు డిమాండ్లకు అంగీకరించిన ఐసీసీ.. తుది నిర్ణయం వెల్లడించేందుకు 24 గంటల సమయం ఇచ్చింది. సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం భారత్-పాక్ మ్యాచ్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు ఐసీసీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని బీసీసీఐ తెలిపింది.షెడ్యూల్ ప్రకారం భారత జట్టు శ్రీలంకకు వెళ్లి మ్యాచ్‌కు సిద్ధమయ్యే అవకాశం ఉంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఐసీసీకి బంగారు బాతులాంటిది. ఈ మ్యాచ్ ద్వారా సుమారు రూ.2200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.
ఒకవేళ పాకిస్థాన్ మ్యాచ్ ఆడకపోతే ఐసీసీతో పాటు బ్రాడ్‌కాస్టర్లకు భారీ నష్టం వాటిల్లనుంది. దాంతో ఇతర క్రికెట్ బోర్డులు కూడా పాకిస్థాన్‌పై ఒత్తిడి తెస్తున్నాయి. ఐసీసీ సూచనలను కాదని పీసీబీ మ్యాచ్‌ను బహిష్కరిస్తే కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. తాత్కలిక నిషేధం విధించడంతో పాటు పీఎస్‌ఎల్‌లో ఇతర దేశాల ఆటగాళ్లు పాల్గొనకుండా ఆంక్షలు విధించే ఛాన్స్ ఉంది.