
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దుమ్ములేపాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు నమోదు చేసిన భారత కెప్టెన్.. టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని టాప్-5లోకి దూసుకొచ్చాడు. దాంతో ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ టాప్-5లో ఉన్న ఏకైక ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. వన్డేల్లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీ.. టెస్ట్‌ల్లో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక ఈ సిరీస్‌లో దారుణంగా విఫలమైన కేఎల్ రాహుల్(1, 0, 0) ఒక స్థానాన్ని కోల్పోయి నాల్గో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలన్ 894 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. మూడో టీ20లో అద్భుత హాఫ్ సెంచరీతో ఇంగ్లండ్‌కు విజయాన్ని అందించిన జోస్ బట్లర్ టాప్-20లో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం 19వ స్థానంలో కొనసాగుతున్నాడు. బెయిర్ స్టో 14, జాసన్ రాయ్ 24వ స్థానంలో నిలిచారు.
ఫస్ట్ టీ20లో హాఫ్ సెంచరీతో రాణించిన టీమిండియా యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ 32 స్థానాలు మెరుగుపరుచుని 31వ ర్యాంకు అందుకున్నాడు. రిషభ్ పంత్ 30 స్థానాలు మెరుగుపరుచుకుని 80వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో యువ బౌలర్ శార్దూల్ ఠాకూర్ 14 స్థానాలు మెరుగుపరుచుకుని 27వ ర్యాంకు అందుకున్నాడు.
ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 43 స్థానాలు ఎగబాకి 34వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
భారత్ పతనాన్ని శాసించిన మార్క్ ఉడ్ ఏకంగా 59 స్థానాలను మెరుగుపరుచుకుని 39వ ర్యాంకులోకి దూసుకొచ్చాడు. వన్డే విభాగంలో తొలి రెండు స్థానాలలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. శ్రీలంకతో సిరీస్‌లో అద్భుతంగా రాణించిన విండీస్ క్రికెటర్ షై హోప్ ఐదు స్థానాలు మెరుగయ్యాడు. ప్రస్తుతం 8వ ర్యాంకును అందుకున్నాడు.