దుబాయ్: ఆసియా కప్ 2023లో హ్యాట్రిక్ విజయాలతో ఫైనల్ చేరిన టీమిండియా.. వన్డే ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది. అగ్రస్తానానికి మూడు పాయింట్ల దూరంలో నిలిచింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్, టీమిండియా తమ ర్యాంకులను నిలబెట్టుకున్నాయి. 118 పాయింట్లతో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ టాప్-2లో ఉండగా 116 పాయింట్లతో టీమిండియా మూడో ప్లేస్‌లో నిలిచింది.
ఈ మూడు జట్ల మధ్య వ్యత్యాసం కేవలం 2 పాయింట్లు మాత్రమే. వచ్చే వారం విడుదలయ్యే ర్యాంకింగ్స్‌లో మార్పులు జరగవచ్చు. ఆసియాకప్‌లో భారత్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే అగ్రస్థానాన్ని అందుకోనుంది.

తాజా ర్యాంకింగ్స్ భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ టాప్-10లో నిలిచారు. రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన శుభ్‌మన్ గిల్ కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్ అందుకున్నాడు. పాకిస్థాన్‌పై శతక్కొట్టిన విరాట్ కోహ్లీ రెండు స్థానాలు ఎగబాకి 8వ స్థానంలో నిలిచాడు. హ్యాంట్రిక్ హాఫ్ సెంచరీలతో దుమ్మురేపిన రోహిత్ కూడా రెండు స్థానాలు మెరుగుపరుచుకొని 9వ స్థానాన్ని అందుకున్నాడు.
గత ఐదేళ్లలో భారత టాప్-3 బ్యాటర్లు టాప్-10 ర్యాంకులు అందుకోవడం ఇదే తొలిసారి. 2019 జనవరిలో చివరిసారిగా భారత టాప్-3 ఆటగాళ్ల టాప్ 10లో నిలిచారు. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అప్పట్లో టాప్-10లో నిలిచారు.
తాజా ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ టాప్-3 ఆటగాళ్లు కూడా టాప్-10లో కొనసాగుతున్నారు. బాబర్ ఆజామ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఇమామ్ ఉల్ హక్ ఐదో స్థానంలో, ఫకార్ జమాన్ 10వ స్థానంలో కొనసాగుతున్నారు.
బౌలర్ల జాబితాలో సంచలన ప్రదర్శన కనబర్చిన కుల్దీప్ యాదవ్ ఐదు స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలో నిలిచాడు. స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ తన 9వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో దుమ్మురేపుతున్న జోష్ హజెల్ వుడ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్ రెండో స్థానంలో ఉన్నారు.