
రసవత్తర పోటీ..
జూలై 1న శశాంక్ మనోహర్ పదవి నుంచి దిగిపోయినప్పటి నుంచి ఐసీసీ చైర్మన్ పీఠం ఖాళీగా ఉంది. ప్రస్తుత తాత్కాలిక చైర్మన్, సింగపూర్‌కు చెందిన ఇమ్రాన్ ఖవాజా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ కొలిన్ గ్రేవ్, వెస్టిండీస్ క్రికెట్ మాజీచీఫ్ డేవ్ కామెరూన్ పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. వీరితోపాటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పోటీ పడే విషయం ఆసక్తికరంగా మారింది. కామెరూన్‌ను విండీస్ క్రికెట్ బోర్డు వ్యతిరేకిస్తోంది. క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ ఏ) అధ్యక్షుడు క్రిస్ నెంజానీ కూడా పోటీకి సిద్ధమవుతున్నట్టు సమాచారం. మరోవైపు గంగూలీ పోటీకి దిగితే తాను మద్దతు ఇస్తానని సీఎస్‌ఏ డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ ప్రకటించడం నెంజానీకి నచ్చలేదు.

ఐసీసీ విధివిధానాల తర్వాతే..
అయితే చైర్మన్ ఎన్నికపై ఐసీసీ విధివిధానాలను ప్రకటించిన తర్వాత గంగూలీ పోటీపడడంపై ఆలోచిస్తామని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ చెప్పారు.‘నామినేషన్ విధానం ఫైనల్ కానివ్వండి. దానికి అనుగుణంగా బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది.'అని ధుమాల్ పేర్కొన్నాడు. మరోవైపు గంగూలీ మాత్రం ఐసీసీ ఛైర్మన్ పదవి చేపట్టడానికి తాను ఇంకా చిన్నవాడినని, ఇప్పుడే తొందర లేదని ఆ మధ్య ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ స్పష్టం చేశాడు.

బీసీసీఐ నుంతి తప్పుకోవాలి..
‘ఐసీసీ ఛైర్మన్ పదవి గురించి నాకు తెలియదు. అది బోర్డు సభ్యులందరూ కలిసి తీసుకునే నిర్ణయం. అలాగే ఇప్పుడు ఐసీసీ నిబంధనలు కూడా మారాయి. ఒకవేళ ఎవరైనా ఆ పదవిలో కొనసాగాలంటే ఆ వ్యక్తి తన దేశం తరఫున బోర్డులోని పదవుల నుంచి తప్పుకోవాలి. ఇంతకుముందులా రెండు పదవులు చేపట్టే అవకాశం లేదు. అది బీసీసీఐ చేసిన మార్పు కాదు, ఐసీసీ చేసిందే. అయితే, ఇప్పుడున్న బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. ఇక్కడ పదవిలో ఉంటూనే ఐసీసీ లేదా ఏసీసీలో కొనసాగొచ్చు. కానీ, బీసీసీఐలో మాత్రం రెండు పదవులు చేపట్టకూడదు. అలాగే ఐసీసీ నిబంధనల ప్రకారం అక్కడా, ఇక్కడా రెండు పదవులు కలిగి ఉండొద్దు' అని గంగూలీ వివరించాడు.

మధ్యలో వదిలేయడం బాగుండదు..
చివరగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను బీసీసీఐ నుంచి తప్పుకోవడం కూడా సరికాదని దాదా పేర్కొన్నాడు. 'భారత క్రికెట్ బోర్డును ఇలా మధ్యలో వదిలి వెళ్లడం, లేదా వెళ్లాల్సిన పరిస్థితులు రావడం సరైనవో కాదో నాకు తెలియదు. కానీ, ఐసీసీ ఛైర్మన్ పదవికి మాత్రం తొందరపడట్లేదు. అందుకు నేనింకా చిన్నవాడిని. అవి ఎంతో గౌరవప్రదమైన పదవులు. జీవితంలో ఒక్కసారే చేసే పనులు.
ఇంతకుముందు ఆ పదవుల్లో కొనసాగిన గొప్ప పాలకులంతా ఒక్కొక్కసారే ఆయా బాధ్యతలు చేపట్టారు. క్రీడలకు సంబంధించినంత వరకు ఇతరుల కన్నా నాకు మరిన్ని ఎక్కువ విషయాలు తెలుసు. ఎందుకంటే నా జీవితమంతా ఆటతోనే ముడిపడి సాగింది. కాబట్టి, ఐసీసీ పదవిని చేపట్టాల్సి వస్తే అది బోర్డు సభ్యులందరి నిర్ణయం ప్రకారమే జరగుతుంది' అని దాదా స్పష్టం చేశాడు.


Click it and Unblock the Notifications
