ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించిన మ్యాచ్ అధికారుల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రకటించింది. 12 లీగ్ మ్యాచ్‌లకు సంబంధించిన మ్యాచ్ అఫిషియల్స్ జాబితాను సోమవారం వెల్లడించింది. యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్-పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్‌కు పాల్ రీఫెల్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా ఐసీసీ ఎంపిక చేసింది. ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా ఈ బిగ్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే.
ఈ దాయాదుల సమరానికి మైకేల్ గాఫ్ టీవీ అంపైర్‌గా వ్యవహరించనుండగా.. అడ్రైన్ హోల్డ్‌స్టాక్ నాలుగో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. మ్యాచ్ రిఫరీగా డెవిడ్ బూన్ వ్యవహరించనున్నాడు. పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫిబ్రవరి 19న జరిగే ఈ టోర్నీ తొలి మ్యాచ్‌కు రిచర్డ్ కెటిల్‌బరో, షర్ఫుద్దౌల ఇబ్నె షాహిద్ ఫీల్డ్ అంపైర్లుగా ఎంపికవ్వగా.. జోయల్ విల్సెన్ టీవీ అంపైర్‌గా.. అలెక్స్ వార్ఫ్ నాలుగో అంపైర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆండ్రూ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అనంతరం ఆండ్రూ ప్రైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా మళ్లీ బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి.

భారత్ అంపైర్లకు నో ఛాన్స్..
పాకిస్థాన్ వెళ్లేందుకు భారత అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు అయిష్టత కనబర్చడంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జాబితాలో ఎవరికి అవకాశం దక్కలేదు. భారత అంపైర్ నితిన్ మీనన్‌తో పాటు మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ పేర్లను ఐసీసీ షార్ట్ లిస్ట్ చేసినా.. వారు పాకిస్థాన్ వెళ్లేందుకు నిరాకరించారు. దాంతో ఈ టోర్నీలో భారత అధికారులు లేకుండా పోయారు.
ఐరెన్ లెగ్ అంపైర్ లేడు...
భారత మ్యాచ్‌లకు సంబంధించిన మ్యాచ్ అఫిషయల్స్ జాబితాలో రిచర్డ్ కెటిల్ బరో లేకపోవడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే నాకౌట్ మ్యాచ్‌లకు సంబంధించిన మ్యాచ్ అఫిషియల్స్‌ను ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ భారత్ సెమీస్ చేరిన తర్వాత రిచర్డ్ కెటిల్ బరోను అంపైర్‌గా ఎంపిక చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిచర్డ్ కెటిల్ బరో.. టీమిండియాకు ఐరెన్ లెగ్ అంపైర్.
రిచర్డ్ మామ ఉంటే ఓటమే..
ఎందుకంటే కెటిల్ బరో అంపైరింగ్ చేసిన నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రతికూల ఫలితమే వచ్చింది. 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2015 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్, 2016 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, 2023 డబ్ల్యూటీసీ ఫైనల్, వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో కెటిల్ బరో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించగా.. భారత్ ఓటమిపాలైంది. కానీ టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో రిచర్డ్ మామ టీవీ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించగా.. టీమిండియా విజయం సాధించింది.
భారత మ్యాచ్‌ల అంపైర్లు..
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్(ఫిబ్రవరి 20)
ఆన్‌ఫీల్డ్ అంపైర్లు: అడ్రైన్ హోల్డ్‌స్టాక్, పాల్ రిఫెల్
టీవీఅంపైర్: రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, నాలుగో అంపైర్: మైకేల్ గాఫ్, మ్యాచ్ రిఫరీ: డేవిడ్ బూన్
భారత్ వర్సెస్ పాకిస్థాన్(ఫిబ్రవరి 23)
ఆన్‌ఫీల్డ్ అంపైర్లు: రిచర్డ్ ఇల్లింగ్ వర్త్, పాల్ రిఫెల్
టీవీఅంపైర్: మైకేల్ గాఫ్, నాలుగో అంపైర్: అడ్రైన్ హోల్డ్‌స్టాక్, మ్యాచ్ రిఫరీ: డేవిడ్ బూన్
భారత్ వర్సెస్ న్యూజిలాండ్(మార్చి 2)
ఆన్‌ఫీల్డ్ అంపైర్లు: మైకేల్ గాఫ్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్
టీవీఅంపైర్: అడ్రైన్ హోల్డ్‌స్టాక్, నాలుగో అంపైర్: పాల్ రిఫెల్, మ్యాచ్ రిఫరీ: డేవిడ్ బూన్