
ముంబై: ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ కంటే రవిచంద్రన్ అశ్విన్ మెరుగైన స్పిన్నర్ అని ఆ జట్టు మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అన్నాడు. కుడిచేతి వాటం బ్యాటర్లకు బౌలింగ్ చేసినప్పుడు లయన్ లెగ్ సైడ్ ఎక్కువ పరుగులు ఇస్తాడని పేర్కొన్నాడు. ఈ విషయంలో అశ్విన్ తక్కువ పరుగులిచ్చి, లయన్‌పై పైచేయి సాధించాడని వెల్లడించాడు. జూన్ 18-23 వరకు భారత్- న్యూజిలాండ్ మధ్య జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ నేపథ్యంలో ఓ చానెల్ చర్చా కార్యక్రమంలో చాపెల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇక సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ దేశాల్లో వికెట్లు తీసేందుకు అశ్విన్ వెనుకంజలో ఉంటాడని సంజయ్ మంజ్రేకర్ చెప్పగా.. ఇయాన్ చాపెల్ మాత్రం భిన్నంగా చెప్పుకొచ్చాడు.
'నాథన్ లయన్‌తో పోలిస్తే అశ్వినే మెరుగని నా అభిప్రాయం. 2018 నుంచి లైయన్ స్ట్రైక్‌రేట్ గమనించండి. అతను కుడిచేతివాటం బ్యాటర్లకు బౌలింగ్ చేస్తుంటే ఆన్‌సైడ్ ఎక్కువ పరుగులు ఇస్తాడు. నిజానికి అలా జరగొద్దు. నిజమే, లయన్ మంచి బౌలరే. కానీ అశ్విన్ అంతకన్నా మెరుగైన బౌలర్' అని చాపెల్ అభిప్రాయపడ్డాడు.
'నేను మరికొన్ని విషయాలు చెబుతా. మీరొకసారి జోయెల్ గార్నర్‌ను చూడండి. ఎన్నిసార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడో పరిశీలించండి. ఎక్కువగా ఉండవు. కానీ అతడెందుకు మెరుగైన బౌలర్‌గా ఉన్నాడు? ఎందుకంటే అతనితోపాటు ఆడిన మిగతా ముగ్గురు, నలుగురు బౌలర్లు అత్యుత్తమం. ఈ తరంలో టీమిండియా బౌలింగ్ దాడి అంత పటిష్ఠంగా ఉందని నా అభిప్రాయం. ఎక్కువ మంది వికెట్లను పంచుకుంటున్నారు' అని చాపెల్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఇంగ్లండ్‌లో అడుగుపెట్టిన టీమిండియా మూడు రోజుల హార్డ్ క్వారంటైన్ పూర్తి చేసుకొని నెట్ ప్రాక్టీస్ సెషన్ షురూ చేసింది.