
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ లిమిటెడ్ ఓవర్ల సారథి బాబర్ అజామ్‌ల ఆటను చూస్తుంటే దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గుర్తొస్తున్నాడని వెస్టిండీస్ మాజీ పేసర్ ఇయాన్ బిషప్ తెలిపాడు. తాజాగా జింబాబ్వే మాజీ క్రికెటర్ పామీ బంగ్వాతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌చాట్‌లో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
'విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్ స్ట్రైట్‌గా ఆడటం చూస్తే సచిన్ టెండూల్కర్ గుర్తొస్తాడు. లిటిల్ మాస్టర్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అనడానికి ఒక కారణం ఉంది. నా బౌలింగ్‌లో అతనెప్పుడూ ఆధిపత్యం చెలాయించేవాడు. ఇప్పుడున్న బ్యాట్స్‌మెన్‌లో కోహ్లీ, బాబర్ అలాగే ఆడుతున్నారు' అని బిషప్ పేర్కొన్నాడు. అనంతరం టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌పై స్పందిస్తూ.. అతడో అత్యుత్తమ పేసర్ అని, అన్ని ఫార్మాట్లకు తగ్గట్టు బౌలింగ్ చేయడం గొప్ప విషయమని కొనియాడాడు.
ఇక గత రెండేళ్లుగా కోహ్లీ, బాబర్ ఆజం బ్యాటింగ్ తీరును అందరు పోలుస్తున్న సంగతి తెలిసిందే. ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్ జాబితాలో 25 ఏళ్ల బాబర్ మొదటి స్థానంలో ఉండగా కోహ్లి 10వ స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో ర్యాంకింగ్స్‌లో కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా బాబర్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో స్టీవ్ స్మిత్ తరువాత రెండో స్థానంలో కోహ్లీ ఉండగా.. బాబర్ ఆరో స్థానంలో ఉన్నాడు.
కరోనా కారణంగా ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన కోహ్లీ.. ఐపీఎల్ 2020 సీజన్‌కు సమాయత్తం అవుతున్నాడు. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు దుబాయ్ వేదిగా ఐపీఎల్-2020 నిర్వహించేందుకు బీసీసీఐ సన్నదం అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న బాబర్ అజామ్.. తొలి టెస్ట్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో రాణించినా రెండో ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఆద్యాంతం ఆధిపత్యం కనబర్చిన పాక్.. గెలుపు ముంగిట బోర్లాపడి ఓటమిపాలైంది.