సౌతాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో కీలకమైన చివరి 5 ఓవర్లలో కెప్టెన్‌గా తాను తీవ్ర ఒత్తిడికి గురైనట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. సౌతాఫ్రికా హిట్టర్ హెన్రీచ్ క్లాసెన్ భారీ సిక్స్‌లు బాదడంతో తన మైండ్ బ్లాంక్ అయ్యిందని, ఏం చేయాలో అర్థం కాలేదని గుర్తు చేసుకున్నాడు.
ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా సంచలన విజయాన్ని అందుకొని విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐసీసీ టైటిల్‌ను ముద్దాడింది. ఫైనల్ మ్యాచ్‌లో హెన్రీచ్ క్లాసెన్ భారీ సిక్స్‌లతో ఓ దశలో సౌతాఫ్రికా విజయం ఖాయమనే అభిప్రాయం కలిగింది. ఆ జట్టు విజయానికి 30 బంతుల్లో 30 పరుగులే చేయాల్సి రావడంతో భారత్‌కు ఓటమి తప్పదని అంతా అనుకున్నారు.

భారత ఆటగాళ్లు కూడా మ్యాచ్ మీద ఆశలు వదులుకున్నట్లే కనిపించారు. కానీ చివరి 5 ఓవర్లలో బౌలర్లు, ఫీల్డర్లు అద్భుత ప్రదర్శనతో టీమిండియా అనూహ్య విజయాన్నందుకుంది. అయితే అక్షర్ పటేల్ వేసిన 15వ ఓవర్లలో క్లాసెన్ చెలరేగడంతో తన మైండ్ బ్లాంక్ అయ్యిందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
టీ20 ప్రపంచకప్ విజయానంతరం విశ్రాంతిలో ఉన్న హిట్ మ్యాన్.. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నాడు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా ఓ ఈవెంట్‌లో ప్రపంచకప్ ఫైనల్లో తాను పడిన టెన్షన్ గురించి వివరించాడు.
'15వ ఓవర్‌లో క్లాసెన్ చెలరేగిపోవడంతో నా మైండ్ బ్లాంక్ అయ్యింది. ఏం చేయాలో అర్థం కాలేదు. సౌతాఫ్రికా 30 బంతుల్లో 30 రన్స్ చేయాల్సినప్పుడు మేం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాం. కానీ ఎక్కువగా ఆలోచించలేదు. ఆ క్షణంలో ఏం చేయాలనేదానిపై మాత్రమే ఫోకస్ పెట్టాం. ఏమాత్రం భయపడలేదు. మేమంతా ప్రశాంతంగా ఉన్నాం. అప్పుడు మా జట్టు ప్రవర్తించిన తీరు బాగుంది.
చివరి ఓవర్లు మేం అద్భుతంగా బౌలింగ్ చేశాం. మా బౌలింగ్ చూస్తేనే మేం ఎంత ప్రశాంతంగా ఉన్నామనే విషయం అర్థమవుతోంది. విపత్కర పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండటంతోనే విజయం దక్కింది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. జట్టులోని ఆటగాళ్లందరినీ తన కుటుంబ సభ్యుల్లా చూసుకునేవాడినని, మైదానం బయట కూడా వారితో సన్నిహితంగా ఉండేవాడినని తెలిపాడు. దాంతోనే కెప్టెన్‌గా తన పని ఈజీ అయ్యిందని చెప్పుకొచ్చాడు.