తీవ్ర కోపం వచ్చింది.. కానీ భయపడలేదు: రింకూ సింగ్
బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఏదీ అనుకూలంగా లేకపోవడంతో తీవ్ర కోపం వచ్చిందని, కానీ షాట్స్ ఆడటానికి తాను ఏ మాత్రం భయపడలేదని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫినిషర్ రింకూ సింగ్ అన్నాడు. ఈ రోజు తనకు అదృష్టం కలిసొచ్చిందని, దాంతోనే మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయగలిగానని తెలిపాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రింకూ సింగ్(34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
తీవ్ర కోపం వచ్చింది..
ఈ మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన రింకూ సింగ్.. ఈ గెలుపు తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందని తెలిపాడు. ఈ మూమెంటమ్‌ను ఇలానే కొనసాగించే ప్రయత్నం చేస్తామని వెల్లడించాడు. 'బ్యాటింగ్ చేసే సమయంలో నేను కాస్త కోపంగానే ఉన్నాను.
కొన్నిసార్లు మనకు అనుకూలంగా ఏదీ జరగనప్పుడు అసహనానికి గురవుతాం.కానీ నేను షాట్లు ఆడటానికి ఏ మాత్రం తడబడలేదు.. భయపడలేదు. మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాలనేదే నా ఆలోచన. దీని గురించి నేను మా కోచ్‌తో పాటు నా బ్యాటింగ్ భాగస్వామితో కూడా చర్చించాను. మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున చివరి వరకు పోరాడాలని అనుకున్నాం.

లక్ నా వైపు ఉంది..
కొన్నిసార్లు మనకు అదృష్టం కూడా కలిసొస్తుంది. ఆరంభంలోనే నాకు లైఫ్ లభించింది. ఆ క్షణంలో నా బుర్ర పని చేయలేదు. అందుకే అలాంటి పేలవ షాట్ ఆడాను. కానీ అదృష్టం నా వైపు ఉంది. చివరికి మేం మ్యాచ్ గెలిచాం. నేను ఇప్పటికే చాలా ఇన్నింగ్స్‌లు ఆడాను. ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. నా గురించి ఏదేదో మాట్లాడారు. వాటన్నింటికి మైదానంలోనే సమాధానం చెప్పాలనుకున్నాను.
ఇది నాకు చాలా మంచి ఇన్నింగ్స్. నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. నాకు ఒక నిర్ణీత బ్యాటింగ్ స్థానం అంటూ ఏం లేదు. నేను ఐదో నంబర్‌లో, ఇంకా లోయరార్డర్‌లో గానీ లేదా నాలుగో నంబర్‌లో కూడా బ్యాటింగ్ చేయగలను. జట్టుకు ఎక్కడ అవసరమైతే అక్కడ బ్యాటింగ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ విజయం మాకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఈ సీజన్‌లో మాకు ఇది మొదటి విజయం. ఇక్కడి నుంచి మేము ఇదే మూమెంటమ్‌ను కొనసాగించాలని అనుకుంటున్నాం.'అని రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications