Rohit Sharma: ఐసీసీ వన్డే ప్రపంచకప్ ట్రోఫీ గెలవడమే తన జీవిత లక్ష్యమని టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ( అన్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లు రెండు గెలిచినా.. ఛాంపియన్స్ ట్రోఫీలు అందుకున్నా.. వన్డే ప్రపంచకప్ తన ప్రత్యేకమని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.
వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా సిద్దమవుతున్నాడు. ఈ టోర్నీలో టీమిండియాను విజేతగా నిలబెట్టేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని రోహిత్ తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న రోహిత్ శర్మ.. ఐసీసీ నిర్వహించిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వన్డే ప్రపంచకప్‌కు తాను ఇచ్చే ప్రాధాన్యతను వివరించాడు. కచ్చితంగా మెగా టోర్నీ ఆడుతానని, అందుకోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పాడు.
'నా దేశం కోసం వన్డే ప్రపంచకప్ గెలవాలని నేను కోరుకుంటున్నాను. నేను వన్డే ప్రపంచకప్ టోర్నీలు చూస్తూ పెరిగాను. అప్పట్లో టీ20 వరల్డ్ కప్ కానీ, ఐపీఎల్ కానీ లేవు. వన్డే ప్రపంచకప్ ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి జరుగుతుంది. దానికి చాలా విలువ ఉంది. నాకు ఆ ట్రోఫీ గెలవాలని ఉంది. దాన్ని పొందేందుకు నేను నా శక్తివంచన లేకుండా కృషి చేస్తా'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత్ గెలిచిన అరంగేట్ర టీ20 ప్రపంచకప్ 2007తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ 2013 గెలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్న రోహిత్ శర్మ.. తన సారథ్యంలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని గెలిచాడు. కానీ ధోనీ గెలిచిన 2011 వన్డే వరల్డ్ కప్ జట్టులో అతను చోటు దక్కించుకోలేకపోయాడు. దాంతోనే 6 ఐపీఎల్ టైటిల్స్(ముంబై 5, డక్కెన్ చార్జర్స్ 1), రెండేసి టీ20 ప్రపంచకప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీలు గెలిచిన రోహిత్ శర్మకు.. వన్డే ప్రపంచకప్ లోటుగా ఉంది. ఆ ఒక్క ముచ్చట కూడా తీర్చుకోవాలని రోహిత్ కలలు కంటున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టును అజేయంగా ఫైనల్ చేర్చిన రోహిత్.. తృటిలో టైటిల్ కోల్పోయాడు.
బీసీసీఐ ఇటీవల ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో రోహిత్ శర్మ గ్రూప్ బిలోకి మారాడు. ఇంతకుముందు అతను ఏ + లో ఉండేవాడు. ప్రస్తుతం బీసీసీఐ ఆ కేటగిరీని తొలగించింది. కేవలం ఏ, బీ, సీ కేటగిరీలను మాత్రమే కేటాయించింది. శుభ్‌మన్, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా మాత్రమే గ్రూప్ ఏ స్థానం దక్కించుకున్నారు.