శ్రీలంక పర్యటనలో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్న మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడ్స్ మెంటార్ బాధ్యతల నుంచి తప్పుకున్న గంభీర్.. ఆ జట్టుకు వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ వీడియోను షేర్ చేశాడు.
ఐపీఎల్‌లో సుదీర్ఘకాలం కేకేఆర్‌కు ఆడిన గంభీర్ కెప్టెన్‌గా( 2012, 2014) రెండు టైటిళ్లు అందించాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో మెంటార్‌గా బాధ్యతలు చేపట్టి మరోసారి ఆ జట్టును విజేతగా నిలబెట్టాడు. ఈ విజయంతో టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలను అందుకున్నాడు.

ఈ క్రమంలో కోల్‌కతా నగరం, అభిమానులతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న గంభీర్.. ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. కేకేఆర్ అభిమానులతో పాటు మెనేజ్‌మెంట్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌లకు ధన్యవాదాలు తెలిపాడు.
'కోల్‌కతా అభిమానులారా నాతో కలిసి రండి.. కొత్త వారసత్వాలను సృష్టిద్దాం. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్స్‌కు స్పెషల్ థ్యాక్స్'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ఈ వీడియోను కేకేఆర్ టీమ్‌తో పాటు ఆ జట్టు కో-ఓనర్ షారూక్ ఖాన్‌లకు ట్యాగ్ చేశాడు.
ఈడెన్ గార్డెన్స్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ఈ వీడియోలొ.. కేకేఆర్‌తో తన ప్రయాణాన్ని గంభీర్ గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. 'కోల్‌కతా అభిమానులరా.. మీరు నవ్వితే నేను నవ్వుతాను. మీరు ఏడిస్తే నేను ఏడుస్తాను. మీరు ఓడితే నేను ఓడిపోతాను. మీరు ఏది చేస్తే నేను అది చేస్తాను. కోల్‌కతాలో నేను ఒకడిని.
మీ కష్టాలు, సుఖాలన్నీ నాకు తెలుసు. నా వీడ్కోలుతో మీరు భావోద్వేగానికి గురయ్యారని నాకు తెలుసు. కోల్‌కతాతో నాది విడదీయలేని బంధం. మనమంతా కలిసి కొన్ని వారసత్వాలను సృష్టిద్దాం. మేం కొన్ని పెద్ద అధ్యాయాలను లిఖించే సమయం వచ్చింది. ఆ అధ్యాయాలు సిరాతో కాదు టీమిండియా బ్లూ జెర్సీతో లిఖించాలి.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
ఈ నెలాఖరులో టీమిండియా.. శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుండగా.. హెడ్ కోచ్‌గా గంభీర్ తన బాధ్యతలను చేపట్టనున్నాడు. జూలై 27 నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.