ఆసియా కప్ 2025లో పాకిస్థాన్‌తో భారత్ ఆడకపోవడమే మంచిదని ఆ జట్టు మాజీ క్రికెటర్ బసిత్ అలీ అన్నాడు. భారత్ చేతిలో ఓడిపోవడం కంటే ఆడకుండా ఉండటమే మంచిదని అభిప్రాయపడ్డాడు. ఇటీవల వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఇండియా లెజెండ్స్ ఎలా అయితే బాయ్‌కాట్ చేసిందో అలానే ఆసియాకప్‌లోనూ చేస్తే బాగుంటుందని చెప్పాడు.
తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఈ వ్యవహారంపై మాట్లాడిన బసిత్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను భారత్ బహిష్కరించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపాడు. 'లెజెండ్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఎలాగైతే భారత్.. పాకిస్థాన్‌తో ఆడటానికి నిరాకరించిందో.. అలాగే ఆసియా కప్‌లో కూడా ఆడకూడదని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే భారత్ చేతిలో ఎదురయ్యే ఘోర పరాజయాన్ని తట్టుకోలేను.'అని బసిత్ అలీ చెప్పుకొచ్చారు.

ఇటీవల పాకిస్థాన్ జట్టు 34 ఏళ్ల తర్వాత వెస్టిండీస్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది. ఈ ఘోర పరాజయం నేపథ్యంలోనే బసిత్ అలీ ఈ వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్ చేతిలోనే ఓడిన జట్టు.. భారత్‌పై ఎలా గెలుస్తుందనే అర్థంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. బసిత్ అలీ కామెంట్స్‌పై ఆ జట్టు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారత అభిమానులు మాత్రం అతనితో ఏకీభవిస్తున్నారు. వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో పాకిస్థాన్ 202 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. 92 పరుగులకే కుప్పకూలింది. టీ20 ఫార్మాట్‌లో యూఏఈ వేదికగా జరిగే ఆసియాకప్ 2025లో భారత్, పాకిస్థాన్‌ల మధ్య సెప్టెంబర్ 14న మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు మెరుగైన ప్రదర్శన చేస్తే .. ఫైనల్‌తో సహా మూడు సార్లు తలపడే అవకాశం ఉంది.
ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల పరిస్థితులు నేపథ్యంలో భారత్, పాక్ మ్యాచ్ జరగడంపై సందేహాలు నెలకొన్నాయి. హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు పాక్‌తో మ్యాచ్‌ను బాయ్‌కట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బీసీసీఐ మాత్రం షెడ్యూల్‌కు ఒకే చెప్పింది.