భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి వన్డేలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వడోదర వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్, పేసర్ మహమ్మద్ సిరాజ్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. 'నేనింకా ముసలోడిని కాలేదురా'అని రోహిత్ అనడం నవ్వులు పూయించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
న్యూజిలాండ్ బ్యాటింగ్ సందర్భంగా మహమ్మద్ సిరాజ్ వేసిన 28వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని డారిల్ మిచెల్ మిడ్ వికెట్ దిశగా ఆడగా.. రోహిత్ శర్మ అద్భుతమైన డైవ్‌తో ఆపాడు. అతని ఫీల్డింగ్‌కు ఫిదా అయిన సిరాజ్, శుభ్‌మన్ గిల్ దగ్గరకు వెళ్లి అభినందించారు. మరోవైపు ప్రేక్షకులు సైతం గట్టిగా అరిచారు. రోహిత్ శర్మ మాత్రం భిన్నంగా స్పందించాడు. 'అదేం అంత కష్టమైన డైవ్ కాదు ఫ్రెండ్స్. నాకు ఇంకా అంత వయసు అయిపోలేదు.'అని అన్నాడు. ఆ మాటలకు గిల్, సిరాజ్ నవ్వు ఆపుకోలేకపోయారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 పరుగుల భారీ స్కోర్ చేసింది. డారిల్ మిచెల్(71 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 84), డెవాన్ కాన్వే(67 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56), హెన్రీ నికోల్స్(69 బంతుల్లో 8 ఫోర్లతో 62) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(2/40), హర్షిత్ రాణా(2/65), ప్రసిధ్ కృష్ణ(2/60) రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టాడు.