తన పేలవ ఫామ్‌పై టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన వ్యక్తిగత ఫామ్ కంటే జట్టు గెలుపే తనకు ముఖ్యమని తెలిపాడు. అయితే ఈ ఏడాది తాను ఆశించిన రీతిలో రాణించలేకపోయానని అంగీకరించాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం బాగా కష్టపడ్డానని, నెట్స్‌లో బాగా సన్నదమయ్యానని తెలిపాడు.
ఈ ఏడాది 11 టీ20లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 11.11 సగటుతో 100 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక ఇన్నింగ్స్‌లో 75 పరుగులు చేయడం గమనార్హం. ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం కాన్‌బెర్రా వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మంగళవారం సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన పేలవ ఫామ్‌పై స్పందించాడు.

'ఫామ్‌లోకి రావడానికి నేను చాలా కష్టపడుతున్నాను. గతంలో కూడా బాగానే హార్డ్ వర్క్ చేశాను. ఈ సిరీస్ కోసం ఇక్కడికివచ్చే ముందు భారత్‌లో బాగా ప్రాక్టీస్ చేశాను. ఇక్కడ కూడా నెట్స్‌లో తీవ్రంగా కష్టపడ్డాను. ఈ సిరీస్‌లో మెరుగ్గా రాణిస్తానని ఆశిస్తున్నా. పరుగులది ఏం ఉంది. ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి. కానీ జట్టు విజయం కోసం కష్టపడటం ముఖ్యం. విభిన్నమైన పరిస్థితుల నుంచి జట్టు మీ నుంచి ఏం కోరుకుంటుందనేది కీలకం. నేను ఒక్కో మ్యాచ్‌ను లక్ష్యంగా తీసుకుంటాను. శుభారంభం దక్కితే మంచి విషయం అవుతుంది.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియాతో తీవ్రంగా గాయపడిన శ్రేయస్ అయ్యర్ గురించి సూర్యకుమార్ యాదవ్ కీలక అప్‌డేట్ ఇచ్చాడు. శ్రేయస్ అయ్యర్ క్షేమంగానే ఉన్నాడని, ఫోన్‌లో మాట్లాడటంతో పాటు మెసేజ్‌లకు రిప్లే ఇస్తున్నాడని తెలిపాడు. ఐసీయూ నుంచి జనరల్ వార్డ్‌కు కూడా షిఫ్ట్ చేశారని చెప్పాడు.
అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకు 85 టీ20లు ఆడిన సూర్య 37.08 సగటుతో 2670 పరుగులు చేశాడు. ఇందులో 21 హాఫ్ సెంచరీలతో పాటు 4 శతకాలు ఉన్నాయి. అయితే 2021-2023 మధ్యలోనే అతను మెజార్టీ పరుగులు చేయడం గమనార్హం. ఈ మధ్య కాలంలో 57 ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 45.55 సగటుతో 2141 పరుగులు చేశాడు. ఇందులో 4 శతకాలతో పాటు 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎలాంటి ఆందోళన చెందడం లేదు.