తరుచూ కెప్టెన్లను మార్చడం.. ఆటగాళ్లు జట్టు కంటే వ్యక్తిగతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతోనే పాకిస్థాన్ క్రికెట్ నాశనమైందని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఆటగాళ్ల గొడవలతో పాటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అనాలోచిత నిర్ణయాలు కూడా ప్రస్తుత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దయనీయస్థితికి ప్రధాన కారణమని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా పాకిస్థాన్ క్రికెట్ గురించి మాట్లాడిన అశ్విన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది. నిజాయితీగా చెప్పాలంటే పాకిస్థాన్ క్రికెట్ నాశనమైంది. పాకిస్థాన్ తరఫున ఎంతో మంది అద్భుతమైన ప్లేయర్లు ఆడారు. ఆ జట్టు కూడా ఎన్నో గొప్ప విజయాలు సాధించింది. ప్రపంచం గర్వపడే జట్టుగానూ గుర్తింపు పొందింది.

ఆ దేశంలో నాణ్యమైన క్రికెటర్లకు కొదవలేదు. ఇప్పటికీ చాలా మంచి ఆటగాళ్లు ఉన్నారు. కానీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో చోటు చేసుకుంటున్న పరిస్థితులు, అనాలోచిత నిర్ణయాలు ఆ జట్టు పతనావస్థకు కారణమయ్యాయి. పదవుల కుర్చీలాటతో పాకిస్థాన్ పరిస్థితి మరింత దిగజారుతోంది.
గతేడాది వన్డే ప్రపంచకప్‌లో ఓటమిపాలైన తర్వాత బాబర్ ఆజామ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
దాంతో షాహిన్ అఫ్రిదిని టీ20 సారథిగా నియమించారు. కొద్ది రోజులకే బాబర్ ఆజామ్ మళ్లీ కెప్టెన్ అయ్యాడు. షాన్ మసూద్‌ను టెస్ట్ సారథిగా ఎంపిక చేశారు. ఆ తర్వాత కూడా పాకిస్థాన్ సొంతగడ్డపై టెస్ట్ విజయం నమోదు చేయలేదు. దాదాపుగా 1000 రోజులుగా పాకిస్థాన్ విజయం సాధించలేదంటేనే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రతీ ఆటగాడే మెరుగ్గా రాణించడంపై ఫోకస్ పెట్టాలి. జట్టు విజయాల్లో భాగమవ్వాలి. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా బాగుండాలి. అంతేకానీ ఏ క్రికెటర్ కూడా జట్టు కంటే వ్యక్తిగతానికి ప్రాధాన్యం ఇవ్వకూడదు'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
ఇటీవల బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌లో పాకిస్థాన్ క్లీన్ స్వీప్ అయ్యింది. రెండు టెస్ట్‌ల్లో ఓటమిపాలై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఘోర పరాజయం నేపథ్యంలో బాబర్ ఆజామ్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దాంతో మరోసారి తదుపరి కెప్టెన్ ఎవరా? అనేది చర్చనీయాంశమైంది. సారథ్యానికి సంబంధించి జరుగుతున్న కర్చీలాటపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.