తన బ్యాటింగ్ కోసం ఇతర ఆటగాళ్లు ఔటైనప్పుడు అభిమానులు పెద్దగా అరవడం తనకు ఏ మాత్రం నచ్చదని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. ప్రేక్షకుల ఉత్సాహాన్ని తాను అర్థం చేసుకోగలనని, కానీ ఇది ఏ మాత్రం సరికాదని అభిప్రాయపడ్డాడు. గతంలో ధోనీ భాయ్‌కి ఇలానే జరిగిందని గుర్తు చేశాడు. తాను రికార్డులను పట్టించుకోవడం లేదని, జట్టు గెలుపే తనకు ముఖ్యమని చెప్పాడు.
న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ(91 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 93) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. కోహ్లీ సెంచరీ చేజారినా ఈ మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. ఈ అవార్డ్ స్వీకరణ సందర్భంగా బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన కోహ్లీ.. సెంచరీ చేజారినందుకు తనకు ఎలాంటి బాధ లేదన్నాడు. సెంచరీలు, రికార్డుల కంటే అభిమానుల ముఖాల్లోని చిరునవ్వు తనకు మరింత సంతోషాన్నిస్తుందని స్పష్టం చేశాడు.

'నేను ఈ అవార్డులన్నింటినీ మా అమ్మకు పంపిస్తాను. ఆవి చూసి ఆమె ఎంతో గర్వపడుతుంది. అంతేకాకుండా వాటిని భద్రంగా పెడుతుంది. నా మొత్తం ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఒక కల నిజమైనట్లుగా అనిపిస్తుంది. నా సామర్థ్యాలు ఏంటో నాకు బాగా తెలుసు. ఈ స్థాయికి చేరుకోవడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. దేవుడు నాకు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువ ఇచ్చాడు. అందుకు నేను ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను.
నిజాయితీగా చెప్పాలంటే.. నేను మైలురాళ్ల గురించి ఆలోచించడం లేదు. ఒకవేళ మేం ముందుగా బ్యాటింగ్ చేసి ఉంటే.. నేను ఇంకా దూకుడుగా ఆడేవాడిని. అనుభవం అనేది ఎప్పుడూ ఉపయోగపడుతుంది. కానీ జట్టును విజయ తీరాలకు చేర్చడమే నా ప్రధాన లక్ష్యం. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసేటప్పుడు పరిస్థితి క్లిష్టంగా ఉంటే.. వినూత్న షాట్లు ఆడకుండానే ఎదురు దాడి చేయాలన్నది నా ప్రాథమిక ఆలోచన. తొలి 20 బంతుల్లోనే వేగంగా ఒక భాగస్వామ్యాన్ని నిర్మించగలమని ఈ రోజు నాకు అనిపించింది. అందుకే ఆరంభంలో దూకుడుగా ఆడి వేగంగా పరుగులు చేశాను.
నా కంటే ముందు బ్యాటర్ ఔట్ అయినప్పుడు ప్రేక్షకులు అరవడం నాకు అస్సలు నచ్చదు. గతంలో ధోనీ భాయ్ విషయంలో ఇలా జరిగేది. ప్రేక్షకుల ఉత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ నేను మాత్రం ఆటపై మాత్రమే ఫోకస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. ప్రేక్షకులు నా ఆటను చూడటానికి వస్తున్నందుకు నేను చాలా కృతజ్ఞుడిని. అది నా అదృష్టం కూడా. అభిమానుల ముఖాల్లో చిరునవ్వు చూడటం నాకు మరింత ఆనందాన్ని ఇస్తుంది.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.