గంభీర్‌ను నేను తప్పించలేదు, తానే ఉండనన్నాడు: అయ్యర్ వివరణ

హైదరాబాద్: ఈ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ వరుస వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ గౌతమ్ గంభీర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు పరాజయాలకు బాధ్యతకు వహిస్తూ ఈ సీజన్ కోసం తనకు రావాల్సిన జీతం మొత్తాన్ని (రూ.2.8 కోట్లు) వదులుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
జట్టు చెత్త ప్రదర్శన కారణంగా ఒక కెప్టెన్ ఈ విధంగా జీతం తీసుకోకుండా ఆడడం ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి. గంభీర్ తన కెప్టెన్సీకి రాజీమానా చేయడంతో అతడి స్థానంలో యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌కు ఢిల్లీ యాజమాన్యం కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది.
కెప్టెన్సీ నుంచి గంభీర్ తప్పుకున్న వెంటనే శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌కి గంభీర్ దూరమయ్యాడు. అతడి స్థానంలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కోలిన్ మున్రోని తుది జట్టులోకి తీసుకున్నారు. గంభీర్‌ను మ్యాచ్ నుంచి తప్పించడంతో అతడు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

8 ఏళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌కు దూరమైన గంభీర్
దాదాపు 8 ఏళ్ల తర్వాత గంభీర్ ఒక ఐపీఎల్ మ్యాచ్‌కు తొలిసారి దూరమయ్యాడు. 2010 ఐపీఎల్‌లో గంభీర్ చివరిసారి తుది జట్టులో చోటు కోల్పోయాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఆనాటి మ్యాచ్‌లో గంభీర్ ఆడలేదు. తాజాగా ఢిల్లీ వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌కి దూరమయ్యాడు.

గౌతిని జట్టు నుంచి మేము తప్పించలేదు
దీనిపై గంభీర్ తనంత తానుగా తుది జట్టు నుంచి తప్పుకున్నాడని, ఈ మ్యాచ్‌లో ఆడకూడదనేది గంభీర్ సొంత నిర్ణయమేనని కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం వివరణ ఇచ్చాడు. 'నిజం చెబుతున్నా. ఇది నా నిర్ణయం కాదు. గౌతిని జట్టు నుంచి మేము తప్పించలేదు. ఇది పూర్తిగా గౌతి తీసుకున్న నిర్ణయం' అని అయ్యర్ అన్నాడు.

తుది జట్టులోకి ఎంపిక చేయవద్దని చెప్పాడు
'మ్యాచ్‌కు ముందు వచ్చి తనను తుది జట్టులోకి ఎంపిక చేయవద్దని చెప్పాడు. ఇది నిజంగా అందర్నీ ఆశ్చర్యపరిచే విషయం. గత మ్యాచ్‌కి కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి ఇప్పుడు ఆడనన్నాడు. గౌతి అలా చెప్పగానే అతనిపై మాకు ఉన్న గౌరవం ఇంకాస్త పెరిగింది' అని శ్రేయాస్ అయ్యర్ వివరించాడు.

ఇప్పటివరకు 4217 పరుగులు చేసిన గంభీర్
2008 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్న గంభీర్ ఇప్పటివరకు 4217 పరుగులు చేశాడు. కానీ ఈసారి ఐపీఎల్ సీజన్ గంభీర్‌కు కలిసిరాలేదు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన గంభీర్ కేవలం 96.59 స్ట్రైక్‌రేటుతో 85 పరుగులు మాత్రమే చేశాడు. గంభీర్ నాయకత్వంలో ఢిల్లీ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్కదానిలో విజయం సాధించింది.

గంభీర్ స్థానంలో జట్టులోకి కొలిన్ మున్రో
కాగా, గంభీర్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఆల్ రౌండర్ కొలిన్ మున్రో.. పృథ్వీ షాతో కలిసి జట్టుకు శుభారంభాన్ని ఇచ్చాడు. కోట్లా వేదికగా శుక్రవారం రాత్రి కోల్ కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టోర్నీ ఆరంభం నుంచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ జట్టు ఏడో స్థానానికి ఎగబాకింది.

మూడు పరాజయాల తర్వాత ఢిల్లీకి విజయం
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి ఓటమి పాలైంది. టోర్నీలో వరుసగా మూడు పరాజయాల తర్వాత మళ్లీ ఢిల్లీ గెలుపొందగా.. కోల్‌కతాకి వరుసగా ఇది రెండో ఓటమి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications