న్యూఢిల్లీ: భారత వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా వస్తున్న సినిమా పైన క్రికెటర్ గౌతమ్ గంభీర్ పరోక్షంగా వ్యాఖ్యలు చేయడంతో ధోనీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గంభీర్ తన వ్యాఖ్యల పైన వివరణ ఇచ్చుకున్నారు.
అవసరమా?: ఎంఎస్ ధోనీకి గౌతమ్ గంభీర్ షాక్క్రికెటర్ల పైన సినిమాలు తీయవలసిన అవసరం ఏమిటని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే. ధోనీ జీవిత కథ ఆధారంగా ఎంఎస్ ధోనీ.. ది అన్‌టోల్డ్ స్టోరీని తెరకెక్కింది. ఇది త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో గంభీర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఆయన మాట్లాడుతూ.. క్రికెటర్ల కంటే దేశం కోసం త్యాగాలు చేసిన వారు, గొప్ప పనులు చేసిన వారు ఎందరో ఉన్నారని చెప్పారు. వారి పైన సినిమాలు తీయాలని సూచించాడు. దీనిపై విమర్శలు వెళ్లువెత్తాయి. తన పైన విమర్శల నేపథ్యంలో గంభీర్ స్పందించారు.
తాను ఎవరికీ వ్యతిరేకం కాదని చెప్పారు. గంభీర్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. తాను ఎవరి బయోపిక్‌కు వ్యతిరేకం కాదన్నారు.
తన ఉద్దేశ్యం వేరే అన్నారు. మన దేశం కోసం 17 మంది జవాన్లు చనిపోయారని, వారి కంటే ఏది ఎక్కువ అన్నారు. అలాంటి అమరజవాన్ల కంటే ఎవరు మంచి స్ఫూర్తి అనేదే తన ఉద్దేశ్యమని చెప్పారు. సైనికులు వారి జీవితాలను త్యాగం చేశారన్నారు.