
బర్మింగ్ హామ్: టీమిండియా యువ పేసర్, హైదరాబాద్ స్టార్ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. ఈ మేరకు వార్విక్‌షైర్‌తో ఒప్పందం చేసుకున్నాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా సెప్టెంబర్‌లో వార్విక్‌షైర్ ఆడనున్న చివరి మూడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో సిరాజ్ బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం జింబాబ్వేతో వన్డే సిరీస్ ఆడుతున్న ఈ హైదరాబాద్ ప్లేయర్.. భారత టీ20 ప్రణాళికల్లో లేకపోవడంతో రెడ్ బాల్ క్రికెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాడు.
ఇక సిరాజ్ తమ జట్టుతో ఒప్పందం చేసుకోవడంపై వార్విక్‌షైర్ క్లబ్ హర్షం వ్యక్తం చేసింది. 'ఈ సీజన్‌లో ఆడే చివరి మూడు కౌంటీ మ్యాచ్‌ల కోసం భారత పేసర్ సిరాజ్‌తో వార్విక్‌షైర్ ఒప్పందం చేసుకుంది. సెప్టెంబర్ 12న వార్విక్‌షైర్-సోమర్‌సెట్ మ్యాచ్ మొదలవడానికి ముందే సిరాజ్ ఎడ్జ్‌బాస్టన్ చేరుకుంటాడు'అని వార్విక్‌షైర్ క్లబ్ పేర్కొంది.
ఇక కౌంటీ క్రికెట్ ఆడేందుకు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని మహమ్మద్ సిరాజ్ తెలిపాడు. 'వార్విక్‌షైర్‌తో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. ఇంగ్లండ్‌లో క్రికెట్ ఆడటాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తా. కౌంటీ క్రికెట్ అనుభవాన్ని కూడా సంపాదించాలని అనుకుంటున్నా'అని సిరాజ్ అన్నాడు. సిరాజ్.. ఈ సీజన్లో వార్విక్‌షైర్‌కు ఆడుతున్న రెండో భారత ఆటగాడు. కృనాల్ పాండ్య ఇప్పటికే రాయల్ లండన్ వన్డే కప్‌లో ఈ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
జూలైలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్‌లో సిరాజ్ 66 పరుగులకే 4 వికెట్లు పడగొట్టాడు. తర్వాత జరిగిన మూడు వన్డేల్లో 6 వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు భారత్‌కు అన్ని ఫార్మాట్లలో 26 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 56 వికెట్లు తీశాడు. టెస్ట్ టీమ్‌లో తన ప్లేస్‌ను సుస్థిరం చేసుకోవాలనే లక్ష్యంతో సిరాజ్ ముందుకు సాగుతున్నాడు.