హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో మరో కీలక పోరుకు సమయం ఆసన్నమైంది. నేడు(గురువారం) ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాదతో జరగనున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తలపడనుంది. ఈ మ్యాచ్ ఫలితంపైనే ఈ సీజన్ ప్లే ఆఫ్స్ భవితవ్యం ఆధారపడి ఉంది.
ఈ మ్యాచ్‌లో గనుక ఆర్‌సీబీ ఓడితే.. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ చేరనున్నాయి. ఆర్‌సీబీ భవితవ్యం మాత్రం ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలిస్తే మాత్రం ప్లే ఆఫ్స్ మరింత రసవత్తరంగా మారనుంది. టేబుల్ రన్నరప్ చెన్నై, లక్నోతో పాటు ఆర్‌సీబీ, ముంబై, పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ తమ ఆఖరి మ్యాచ్ వరకు వేచిచూడాల్సి ఉంటుంది.

దాంతో సన్‌రైజర్స్‌తో జరిగే ఈ పోరు ఆర్‌సీబీతో పాటు ఇతర జట్లకు కీలకంగా మారింది. అయితే హైదరాబాద్ ఫ్రాంచైజీతో ఆర్‌సీబీకి మెరుగైన రికార్డులేకపోవడం ఆ జట్టును కలవరపెడుతోంది. ముఖ్యంగా ఇలాంటి డూఆర్‌డై మ్యాచ్‌ల్లో హైదరాబాద్ ఫ్రాంచైజీ ప్రతీసారి ఆర్‌సీబీకి షాకిచ్చింది. డెక్కన్ చార్జెర్స్ హైదరాబాద్ నుంచే ఆర్‌సీబీకి ఈ గోస మొదలైంది.
ఐపీఎల్ 2009 ఫైనల్స్‌లో ఆర్‌సీబీని డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ ఓడించింది. 2012లో డేయిల్ స్టెయిన్ సూపర్ పెర్ఫామెన్స్‌తో ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను కోల్పోయింది. 2013 సీజన్‌లో కేకేఆర్‌ను ఓడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆర్‌సీబీని వెనక్కినెట్టి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. దాంతో ఆర్‌సీబీ 5వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
2016 సీజన్ ఫైనల్లో అద్వితీయ ప్రదర్శన కనబర్చిన ఆర్‌సీబీని సన్‌రైజర్స్ మట్టికరిపించింది. దాంతో మరోసారి ఆర్‌సీబీ టైటిల్ చేజార్చుకుంది. 2020 సీజన్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీని ఓడించింది. 2021లోనూ సన్‌రైజర్స్ చేతిలో ఓడిన ఆర్‌సీబీ క్వాలిఫయర్-1కు అర్హత సాధించలేకపోయింది.
ఈ క్రమంలోనే నేడు జరిగే డూ ఆర్ డై మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ ఆధిపత్యమే కొనసాగుతుందా? లేక ఆర్‌సీబీ చరిత్రను తిరగరాస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ పేలవ రికార్డుతోనే ఆర్‌సీబీ అభిమానులు కలవరపాటుకు గురవుతున్నారు.