ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీని జమ్మూ కశ్మీర్ కైవసం చేసుకుంది. 67 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలి టైటిల్‌ను ముద్దాడింది. కర్ణాటకతో జరిగిన ఫైనల్ డ్రాగా ముగియడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన జమ్మూ కశ్మీర్‌ను విజేతగా ప్రకటించారు.
186/4 స్కోర్‌తో చివరి రోజు ఆటను కొనసాగించిన జమ్మూ కశ్మీర్ రెండో ఇన్నింగ్స్‌ను 342/4 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. మరో సెషన్ ఆట మాత్రమే మిగిలి ఉండటంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. దాంతో టోర్నీ రూల్స్ ప్రకారం తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన జమ్మూ కశ్మీర్‌ను విజేతగా ప్రకటించారు.
1959-1960లో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన జమ్మూ కశ్మీర్.. తన 67 ఏళ్ల దేశవాళీ చరిత్రలో రంజీ ట్రోఫీ ఫైనల్ చేరడం.. గెలవడం ఇదేతొలిసారి. 2025-26 సీజన్‌లో తొలి మ్యాచ్ నుంచి బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన జమ్మూ కశ్మీర్.. ఫైనల్లోనూ అదే తరహా ప్రదర్శరనతో విజేతగా నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ బారుముల్ల ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీ 60 వికెట్లతో జమ్మూ కశ్మీర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

జమ్మూ కశ్మీర్ విజయం నేపథ్యంలో హైదరాబాద్ రంజీ టీమ్ గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే 92 ఏళ్ల రంజీ క్రికెట్ చరిత్రలో హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే విజేతగా నిలిచింది. 1937-38 సీజన్‌లో తొలి టైటిల్ అందుకుంది. ఫైనల్లో నవనగర్ జట్టుపై గెలుపొందింది. 50 ఏళ్ల తర్వాత 1986-87 సీజన్‌లో ఎం.వి. నరసింహారావు కెప్టెన్సీలో హైదరాబాద్ రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఆ ఫైనల్‌లో ఢిల్లీ జట్టును ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
మరో మూడు సార్లు రన్నరప్‌గా నిలిచింది. 1942-43, 1964-65, 1999-00 సీజన్లలో రన్నరప్‌గా సరిపెట్టుకుంది. అప్పటి నుంచి మరో టైటిల్ కోసం నీరక్షిస్తోంది. 2016-17 సీజన్‌లో హైదరాబాద్ చివరిసారిగా క్వార్టర్ ఫైనల్ చేరింది. కానీ ముంబై చేతిలో ఓటమిపాలైంది. గత కొన్ని సీజన్లలో హైదరాబాద్ జట్టు 'ప్లేట్ గ్రూప్'కు పడిపోయింది. అయితే, 2024-25 సీజన్‌లో ప్లేట్ గ్రూప్ విజేతగా నిలిచి, మళ్ళీ ఎలైట్ గ్రూప్లోకి అడుగుపెట్టింది. కానీ పూర్వ వైభవాన్ని అందుకోలేకపోతుంది.
1953-54 సీజన్‌లో ఆంధ్ర జట్టు మొదటిసారి రంజీ ట్రోఫీ బరిలోకి దిగింది. కానీ ఈ 72 ఏళ్లలో ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేదు. తాజా 2025- 2026 సీజన్‌తో పాటు 2019-20, 2023-24 సీజన్లలో క్వార్టర్ ఫైనల్ చేరడమే ఆంధ్ర జట్టు అత్యుత్తమ ప్రదర్శన. తాజా సీజన్‌లో అత్యుత్త ప్రదర్శన కనబర్చిన ఆంధ్ర జట్టు.. క్వార్టర్స్‌లో బెంగాల్ చేతిలో ఓటమిపాలైంది.
89 ఏళ్ల రంజీ క్రికెట్ చరిత్రలో ముంబై 42 సార్లు విజేతగా నిలవగా.. కర్ణాటక 8, ఢిల్లీ 7, బరోడా, మధ్యప్రదేశ్ ఐదు సార్లు టైటిల్ అందుకున్నాయి. సౌరాష్ట్ర, విదర్భ మూడు సార్లు విజేతగా నిలవగా.. మధ్యప్రదేశ్, హైదరాబాద్, రాజస్థాన్, రైల్వేస్, తమిళనాడు, మహారాష్ట్ర, బెంగాల్ రెండేసి సార్లు విజేతగా నిలిచాయి.