మహిళల ఆసియాకప్ టీ20 టోర్నీలో వరుస విజయాలతో జోరు మీదున్న డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా.. ఆఖరి పోరాటానికి సిద్దమైంది. ఓటమెరుగని జట్టుగా అజేయంగా ఫైనల్ చేరిన హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్.. ఎనిమిదో టైటిల్‌పై కన్నేసింది. నేడు(ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే తుదిపోరులో ఆతిథ్య శ్రీలంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
పటిష్టంగా భారత్..
ఈ టోర్నీ గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన భారత్.. తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన సూపర్ ఫామ్‌లో ఉండగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్‌లతో భారత బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది.

బౌలింగ్‌లో రేణుక సింగ్ నిప్పులు చెరుగుతుండగా.. పూజ్ వస్త్రకార్, దీప్తి శర్, రాధ యాదవ్ మంచి టచ్‌లో ఉన్నారు. మరోవైపు అజేయంగా ఫైనల్ చేరుకున్న శ్రీలంక సైతం టైటిల్‌పై కన్నేసింది.
ఆటపట్టుపైనే ఆశలు..
ఉత్కంఠగా సాగిన రెండో సెమీస్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన శ్రీలంక.. అదే జోరులో భారత్‌ను ఓడించాలనుకుంటుంది. అయితే భారత్‌ను ఓడించడం శ్రీలంకకు అంత సులువైన పనికాదు. ఆ జట్టు కెప్టెన్ చమరి ఆటపట్టుపైనే ఆధారపడి ఉంది. శ్రీలంక విజయాల్లో ఆటపట్టు కీలక పాత్ర పోషించింది
ఇప్పటి వకు 243 పరుగులు చేసిన ఆమె అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతోంది. మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించడం లేదు. బౌలింగ్‌లో ఆఫ్ స్పిన్నర్ కవిష దిల్హారీ మినహా అంతా విఫలమయ్యారు. ఫైనల్ అంటే ఒత్తిడి ఉండటం సహజం. ఒత్తిడిని అధిగమించిన జట్టును విజయం వరిస్తోంది.
ఫ్రీగా ఎలా చూడాలంటే..?
ఈ టోర్నీకి స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. స్టార్ స్పోర్ట్స్‌కు సంబంధించిన అన్నీ చానెల్స్‌లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. స్థానిక భాషల్లోనూ ఈ మ్యాచ్‌కు సంబంధించిన కామెంట్రీ వినవచ్చు. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కు చెందిన డిస్నీ హట్‌స్టార్‌లోనూ ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. హాట్ స్టార్‌లో సబ్‌స్క్రిప్షన్ లేకున్నా ఈ మ్యాచ్‌ను ఫ్రీగా చూడవచ్చు.