అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ 2025లో వరుస విజయాలతో జోరు మీదున్న యంగ్ ఇండియా అసలు సిసలు పోరుకు సిద్దమైంది. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో ఎదురైన ప్రతీ ప్రత్యర్థిని మట్టికరిపిస్తూ ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది.
నిక్కి ప్రసాద్ సారథ్యంలోని భారత్.. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. వెస్టిండీస్, మలేసియా, శ్రీలంక, బంగ్లాదేశ్, స్కాట్లాండ్‌లపై ఏకపక్ష విజయాలు సాధించిన భారత్.. సెమీఫైనల్లో మాత్రం గతేడాది రన్నరప్ అయిన ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది.
తెలంగాణ బిడ్డ జోరు..
తెలంగాణ ప్లేయర్ గొంగడి త్రిష టీమిండియాకు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌గా మారింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోనూ సత్తా చాటుతుంది. గత 6 ఇన్నింగ్స్‌లో ఈ తెలంగాణ బిడ్డ 66.25 సగటుతో 265 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. బౌలింగ్‌లో లెగ్ స్పిన్నర్‌గా సత్తా చాటుతోంది. ఆమెకు తోడుగా ఓపెనర్ కమిలిని రాణిస్తోంది.

బౌలింగ్ విభాగంలో స్పిన్నర్లు వైష్ణవి శర్మ(15 వికెట్లు), ఆయూషి శుక్లా(12) సత్తా చాటుతున్నారు. ఈ టోర్నీలో 6 ఇన్నింగ్స్‌ల్లో టాపార్డర్ చెలరేగడంతో మిడిలార్డర్ బ్యాటర్లకు ఎక్కువ అవకాశాలు రాలేదు. ఒకవేళ ఫైనల్లో టాపార్డర్ తడబడితే మిడిలార్డర్ రాణించాల్సి ఉంటుంది.
పటిష్టంగా సౌతాఫ్రికా..
మరోవైపు సౌతాఫ్రికా తొలిసారి ఫైనల్ చేరింది. ఆ జట్టు కూడా అజేయంగానే తుది జట్టు పోరుకు అర్హత సాధించింది. ఐసీసీ టోర్నీల్లో ఫైనల్లో బోల్తా కొట్టే తమ దేశ క్రికెట్ జట్ల ఆనవాయితీని మార్చాలనే లక్ష్యంతో సౌతాఫ్రికా ఉంది. స్లోటర్న్ వికెట్‌పై ఫైనల్ జరుగుతుండటంతో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు.
ఫ్రీగా ఎలా చూడాలంటే..?
మలేసియాలోని కౌలలాంపూర్ వేదికగా జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్‌తో పాటు డిస్నీ హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ టోర్నీకి స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌ను ఉచితంగా చూసే ఆస్కారం లేదు. స్టార్ స్పోర్ట్స్‌తో పాటు డిస్నీ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. జియోసినిమా- స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ భాగస్వామ్యం కావడంతో ఫ్రీగా మ్యాచ్‌లను ప్రసారం చేయడం లేదు. సంబంధిత నెట్‌వర్క్ మొబైల్ రిచార్జ్ ప్లాన్స్‌తో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు.