హైదరాబాద్: ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న ఆసియాకప్ 2023 టోర్నీకి రంగం సిద్దమైంది. వన్డే ప్రపంచకప్ ముందు టీజర్‌గా జరగనున్న ఈ ఆసియా సమరానికి మరో 24 గంటల్లో తెరలేవనుంది. తొలిసారి ఆసియాకప్‌కు అర్హత సాధించిన నేపాల్, ఆతిథ్య పాకిస్థాన్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ముల్తాన్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుండగా.. ఘనమైన ఆరంభ వేడుకలతో ఈ టోర్నీకి తెరలేవనుంది.
భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. ఆరంభ వేడుకల్లో భారత సింగర్ ఏ ఆర్ రెహ్మాన్ తన గాత్రంతో మైమరిపించనున్నాడు. ఏఆర్ రెహ్మాన్‌తో పాటు పాకిస్థాన్ సింగర్ అతిప్ అస్లామ్ కూడా తన పాటలతో అలరించనున్నాడు. పలువురు ఆసియా సెలబ్రిటీలు డ్యాన్స్ ప్రదర్శన కూడా చేయనున్నారు.

ప్రారంభ వేడుకలతో పాటు ఈ టోర్నీ మ్యాచ్‌లను అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ప్రసారం చేయనుంది. స్టార్ స్పోర్ట్స్ చెందిన పలు భాషా చానెళ్లో కూడా మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఐపీఎల్ తరహాలోనే తెలుగు, తమిళం, కన్నడం, గుజరాతీ పలు భాషల్లో కామెంట్రీ ఉండనుంది.
స్టార్ స్పోర్ట్స్‌కు చెందిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ హాట్ స్టార్‌లో ఈ మ్యాచ్‌లు రానున్నాయి. మొబైల్ యూజర్లు ఎలాంటి రుసుము లేకుండా ఫ్రీగా మ్యాచ్‌లు చూసే అవకాశాన్ని డిస్నీ హాట్‌స్టార్ కల్పించింది. ఐపీఎల్ ప్రసారాలను జియోసినిమా ఉచితంగా అందించడంతో తమ యూజర్లను కాపాడుకునేందుకు హాట్ స్టార్ కూడా సబ్ స్క్రిప్షన్ లేకుండా ఆసియాకప్‌తో పాటు వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లు ప్రసారం చేస్తామని ప్రకటించింది.
ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు బరిలో నిలవగా.. రెండు గ్రూప్‌లుగా విభజించారు. తొలి గ్రూప్‌లో పాకిస్తాన్, ఇండియా, నేపాల్ ఉండగా.. రెండో గ్రూప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్ ఉన్నాయి. లీగ్ దశలో ప్రతీ జట్టు తమ గ్రూప్‌లోని ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అనంతరం రెండు గ్రూప్‌ల్లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి.
సూపర్-4లో ప్రతీ జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అనంతరం టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్ చేరుతాయి. యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తున్న భారత్-పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్ సెప్టెంబర్ 2న( శనివారం) జరగనుంది. మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానున్నాయి.