టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్‌ను వెనక్కి పరుగెత్తుతూ అందుకునే క్రమంలో కిందపడిపోయాడు. దాంతో అతని పక్కటెముకలు నేలను బలంగా తాకడంతో అతని ప్లీహానికి గాయమైంది.
ప్రస్తుతం సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొంతుతున్నాడు. అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని, వేగంగా కోలుకుంటున్నాడని బీసీసీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది. శ్రేయస్ అయ్యర్‌ను టీమ్ డాక్టర్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాడని పేర్కొంది.
ప్లీహం అనేది పిడికిలి పరిమాణంలో ఉండే సాఫ్ట్ పార్ట్. ఎడమవైపున పక్కటెముకల కింద ఉంటుంది. ఇది ప్రధానంగా రెండు పనులు చేస్తుంది. ఇన్ఫెక్లన్లతో పోరాడటంతో పాటు పాత, దెబ్బతిన్న రక్త కణాలను తొలగించి రక్తాన్ని శుద్ది చేస్తుంది. ఇందులో అనేక చిన్న రక్త నాళాలుంటాయి. ఇది శరీరంలోని అత్యంత సున్నితమైన అవయవాల్లో ఒకటి. అందుకే ఎడమవైపున కింద పడటం, పక్కటెముకలకు గాయం తగిలినప్పుడు ప్లీహంలో చీలిక వస్తుంది. అయితే ఈ గాయం కొన్నిసార్లు ప్రాణాపాయానికీ దారి తీస్తుంది.
అయితే అది ప్లీహానికి ఎంత మేర దెబ్బ తగిలింది. ఎంత రక్త స్రావం అవుతుందన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. దెబ్బతిన్న ప్లీహం పరిస్థితిని అంచనా వేయడానికి వైద్యులు సిటీ స్కాన్ మీద ఆధారపడుతారు. ప్లీహానికి చిన్న గాయమైతే.. అది తనంతట తానే మరమ్మత్తు చేసుకుంటుంది. కానీ గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అంతర్గత రక్త స్రావానికి దారి తీస్తుంది. అప్పుడు అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.

ప్లీహానికి గాయమైన తర్వాత తొలి 24 నుంచి 48 గంటలు చాలా ముఖ్యం. ఈ దశ దాటిన తర్వాత ఆరోగ్యం మెరుగ్గా ఉంటే.. డాక్టర్లు వారిని కదలడానికి, ఆహారం తీసుకోవడానికి అనమతిస్తారు. రక్త స్రావం తగ్గిన వారం పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచుకుంటారు. ప్లీహం గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి కొన్ని సమయం పట్టవచ్చు. అది చాలా జాగ్రత్తగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.
శ్రేయస్ అయ్యర్ అదృష్టవంతుడనే చెప్పాలి. గాయమైన వెంటనే అతనికి చికిత్స అందింది. శ్రేయస్ ప్లీహానికి చిన్న గాయమే అయిందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి అతను ఇంకా త్వరగా కోలుకునే అవకాశం ఉంది. క్రికెటర్ కావడంతో సహజంగానే అయ్యర్ ఫిట్‌గా ఉంటాడు. ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు ఉండవు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా బ్యాట్ పట్టేందుకు కాస్త సమయం పట్టనుంది. దాదాపు 3 నెలల సుదీర్ఘ విరామం తర్వాత అతను మళ్లీ టీమిండియాకు బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. అంటే మార్చిలో జరిగే ఐపీఎల్‌తో అయ్యర్ మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వచ్చు.