అతనే లేకుంటే సచిన్ క్రికెట్ గాడ్ అయ్యేవాడు కాదు.. ఆ ఒక్క సాయం!
భారత్‌లో క్రికెట్ మతం అయితే.. ఆ మతానికి ఏకైక దేవుడు అతను! అతను బ్యాట్ పడితే రికార్డులు దాసోహమంటాయి! మైదానంలో అడుగుపెడితే కోట్లాది హృదయాలు ఉప్పొంగుతాయి!
సరిహద్దులతో సంబంధం లేకుండా తన కవర్ డ్రైవ్స్, స్ట్రెయిట్ డ్రైవ్స్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని కట్టిపేడేసిన ధీరుడు అతను! 24 ఏళ్ల పాటు దేశ ఆశలను, ఆకాంక్షలను తన భుజాలపై మోస్తూ.. 100 శతకాలతో రికార్డుల చరిత్రనే తిరగరాసిన క్రికెట్ యోధుడు అతను! అతనెవరో కాదు.. ఒక తరం క్రికెట్ అభిమానులకు శ్వాసగా నిలిచిన క్రికెట్ గాడ్, భారత రత్న సచిన్ రమేష్ టెండూల్కర్!
ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ గురించి ఇప్పటి జెన్ జీకి పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. 90's తరానికి అతను ఆరాధ్య క్రికెటర్. సచిన్ కోసమే క్రికెట్ చూసేవాళ్లంటే అతిశయోక్తి కాదు. సచిన్ ఔటవ్వగానే టీవీ ఆఫ్ అయ్యేది. అంతలా ఆ తరం సచిన్‌ను ఆరాధించింది. సచిన్ గెలుపుల కంటే.. నైంటీస్ తరానికి అందించిన జ్ఞాపకాలే ఎంతో గొప్పవి! నైంటీస్ తరం కోసం ఆ జ్ఞాపకాలను మైఖేల్ తెలుగు గుర్తు చేసే ప్రయత్నం చేస్తోంది. ఓ సిరీస్‌లా సచిన్ క్రికెట్ కెరీర్‌కు సంబంధించిన హైలైట్స్‌ను మీ ముందుకు తీసుకొస్తుంది.

సచిన్ వెనుక ది రియల్ హీరో..
క్రికెట్ గాడ్‌గా క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన సచిన్‌కు కెరీర్ ఆరంభంలో ఓ ఆటగాడు అండగా నిలిచాడు. ఆ రోజు ఆ ప్లేయర్ సాయం చేయకపోయి ఉంటే బహుషా ఇప్పుడు మనం సచిన్ గురించి మాట్లాడుకునేవాళ్లం కాదేమో. ఈ విషయాన్ని సచినే స్వయంగా వెల్లడించాడు. తన ఆటో బయోగ్రఫీ 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో రాసుకొచ్చాడు. సదరు క్రికెటర్ రుణాన్ని నెరవేర్చుకున్నానని కూడా తెలిపాడు.
16 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్ పాకిస్థాన్ పర్యటనకు వెళ్లాడు. అయితే ఈ పర్యటనకు ముందు అతను ఇరానీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. ఢిల్లీ రంజీ టీమ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ రెస్టాఫ్ ఇండియా తరఫున బరిలోకి దిగాడు.
సచిన్ కోసం విరిగిన వేలితో బ్యాటింగ్..
ఈ మ్యాచ్‌లో అప్పటి పంజాబ్ క్రికెటర్, టీమిండియా మాజీ క్రికెటర్ అయిన గురుశరణ్ సింగ్.. సచిన్ టెండూల్కర్‌కు సాయం చేసి అతని కెరీర్‌కు దిక్సూచిగా నిలిచిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ అతుల్ వస్సన్ వేసిన బంతికి గురు శరణ్ చేతి వేలు విరిగిపోయింది. దాంతో అతను మళ్లీ బ్యాటింగ్ చేయడం కష్టమని అంతా అనుకున్నారు.
మరోవైపు ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ అద్భుత బ్యాటింగ్‌తో సెంచరీ దిశగా సాగాడు. 86 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రెస్టాఫ్ ఇండియా 9వ వికెట్ కోల్పోయింది. దాంతో ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసిందని, సచిన్ సెంచరీ మిస్సైందని అంతా అనుకున్నారు.
ఆటగాళ్లంతా మైదానం వీడేందుకు సిద్దం కాగా.. విరిగిన వేలితో బ్యాటింగ్ చేసేందుకు గురుశరణ్ మైదానంలోకి అడుగుపెట్టాడు. అతను నేరుగా సచిన్ వద్దకు వచ్చి సెంచరీ పూర్తయ్యేంత వరకు అండగా ఉంటానని చెప్పాడు. అతని ధైర్యానికి ఫిదా అయిన ఢిల్లీ బౌలర్లు బౌన్సర్లు వేయకుండా గౌరవించారని సచిన్ పేర్కొన్నాడు. రిస్క్ వద్దని తాను చెప్పినా గురుశరణ్ వినలేదని తెలిపాడు. అప్పటి చీఫ్ సెలక్టర్ రాజ్ సింఘ్ దుంగార్ పూర్ అడగటంతోనే గురు శరణ్ బ్యాటింగ్‌కు దిగాడని తనకు తర్వాత తెలిసిందని చెప్పాడు.
రుణం తీర్చుకున్న సచిన్..
2005లో ఢిల్లీలో జరిగిన ఓ బెన్‌ఫిట్ మ్యాచ్ ఆడి గురుశరణ్ రుణం తీర్చుకున్నానని, తక్కువ సమయంలోనే ఈ మ్యాచ్ గురించి చెప్పినా.. బిజీ షెడ్యూల్‌ను పక్కనపెట్టి ఆ మ్యాచ్ ఆడానని సచిన్ పేర్కొన్నాడు. గురుశరణ్ సాయంతో సెంచరీ సాధించిన సచిన్‌కు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో చోటు దక్కింది. ఈ సెంచరీ అందించిన ఆత్మవిశ్వాసంతో సచిన్ ఆ పర్యటనలో ఆకట్టుకొని క్రికెట్ గాడ్‌గా ఎదిగాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

