సొంతగడ్డపై టీమిండియాకు ఊహించని ఫలితం ఎదురైంది. న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను రోహిత్ సేన ఓటమితో ప్రారంభించింది. బెంగళూరు వేదికగా ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఆతిథ్య భారత్‌ను చిత్తు చేసింది. అద్భుతం చేస్తారని భావించిన భారత స్పిన్నర్లు చేతులెత్తేసారు.
దాదాపు 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ గెలిచింది. చివరిసారిగా 1988లో న్యూజిలాండ్ టెస్ట్ విజయాన్నందుకుంది. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన న్యూజిలాండ్ 27.4 ఓవర్లలో 2 వికెట్లు 110 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విల్ యంగ్(76 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 48 నాటౌట్), రచిన్ రవీంద్ర(46 బంతుల్లో 6 ఫోర్లతో 39 నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా ఒక్కడే 2 వికెట్లు తీసాడు. ఈ ఓటమితో సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ పోరాటం వృథా అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 46 పరుగులకు కుప్పకూలగా.. న్యూజిలాండ్ 402 పరుగుల భారీ స్కోర్ చేసింది. 356 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన టీమిండియా 462 పరుగులు చేసింది.
ఈ గెలుపుతో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో న్యూజిలాండ్ ఆధిక్యంలో నిలిచింది. అక్టోబర్ 24 నుంచి పుణే వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే ఈ ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2025 పాయింట్స్ టేబుల్‌లో టీమిండియా విన్నింగ్ పర్సంటేజీని తగ్గించింది. ప్రస్తుతం అగ్రస్థానంలోనే కొనసాగుతున్నా.. ఇతర జట్ల సమీకరణాలతో సంబంధం లేకుండా ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలంటే తదుపరి 7 టెస్ట్‌ల్లో టీమిండియా 4 మ్యాచ్‌లు గెలవడంతో పాటు ఒక మ్యాచ్ డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

న్యూజిలాండ్‌తో రెండు టెస్ట్‌లు ఆడనున్న టీమిండియా.. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మరో 5 టెస్ట్‌లు ఆడనుంది. అయితే న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి ఉంటే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారయ్యేది. కానీ ఈ సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. న్యూజిలాండ్‌తో తదుపరి రెండు టెస్ట్‌లు గెలవడంతో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మరో రెండు టెస్ట్‌లు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా మరో మ్యాచ్‌ను డ్రా చేసుకోవాలి. ఈ సమీకరణం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.