హాకీ స్టిక్ వదిలేసి క్రికెట్ బ్యాట్ పట్టిన మధుర క్షణాలు.. వన్డే ప్రపంచకప్‌కి 37 ఏళ్లు!!

హైదరాబాద్: క్రికెట్‌లో తొలి ప్రపంచకప్ గెలిచే సమయానికి భారత దేశంలో హాకీ క్రీడదే హవా. అప్పటికే ఒకసారి ప్రపంచకప్ గెలవగా.. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో సాధించిన స్వర్ణంతో భారత్ ఖాతాలో ఎనిమిది స్వర్ణ పతకాలు చేరాయి. అలాంటి సమయంలో వచ్చిన కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా ప్రపంచకప్‌ను ముద్దాడింది. దీంతో దేశంలో క్రికెట్‌కు కొత్త అభిమానులు వచ్చారు. ఆ తర్వాత టీమిండియా అద్భుతాలను సృష్టించింది. ఒకవైపు క్రికెట్ అంచెలంచెలుగా ఎదిగిపోగా.. మరోవైపు హాకీ పతనం ప్రారంభమైంది. కొద్దికాలంలో క్రికెట్ భారత్‌లో తిరుగులేని ఆటగా.. ఓ మతంగా మారిపోయింది.

సరిగ్గా 37 ఏళ్లు:
ఎలాంటి అంచనాలు లేకుండానే ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన కపిల్ దేవ్ సేన.. 17 రోజుల్లో చరిత్రను తిరగరాసి జగజ్జేతగా నిలిచింది. లార్డ్స్‌లో సగర్వంగా ప్రపంచకప్‌ను ముద్దాడిన మధురస్మృతులు.. భారత జట్టు వన్డేల్లో తొలిసారి విశ్వ విజేతగా నిలిచి ఈరోజుకి సరిగ్గా 37 ఏళ్లు. ఆ మధుర క్షణాలను మరోమారు గుర్తుచేసుకుంటే..1975లో జరిగిన తొలి ప్రపంచకప్‌లో భారత్ 3 మ్యాచ్‌లలో ఒకటే గెలిచింది. అదికూడా ఈస్ట్ ఆఫ్రికాపై. 1979లో రెండో ప్రపంచకప్‌లో ఆ ఒక్క విజయం కూడాలేదు. ప్రపంచకప్‌లు మినహాయించి అప్పటి వరకు కేవలం 10 వన్డే సిరీస్‌లే ఆడిన భారత్.. సొంతగడ్డపై 2 మాత్రమే గెలుచుకుంది.

ఎలాంటి అంచనాలు లేవు:
1983 ప్రపంచకప్‌లో కపిల్ దేవ్ బృందంపై ఎలాంటి అంచనాలు లేవు. కానీ చివరకు తుదిపోరుకు అర్హత సాధించింది. లీగ్ దశలో గ్రూప్‌లోని మిగిలిన 3 జట్లతో రెండేసిసార్లు భారత్ తలపడింది. అప్పటికే రెండుసార్లు ప్రపంచకప్ నెగ్గి జోరుమీదున్న వెస్టిండీస్‌తో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. ఆట ఆరంభానికి ముందు కపిల్ మాట్లాడుతూ... 'ఈ రోజు మనం విండీస్‌ను ఓడిస్తున్నాం' అన్నాడు. జట్టులోని మిగిలిన సభ్యులంతా ఇది జోక్ అనుకొని నవ్వుకున్నారు. కానీ మైదానంలో దిగాక భారత్ విశ్వరూపం ప్రదర్శించింది.

జింబాబ్వేపై కపిల్ వీరవిహారం:
లీగ్ దశలో వెస్టిండీస్‌పై 34 పరుగులతో గెలుపు.. 66 పరుగులతో ఓటమి. ఆస్ట్రేలియాపై 162 పరుగులతో ఓటమి.. 118 పరుగులతో విజయం. జింబాబ్వేపై 5 వికెట్లతో.. 31 పరుగులతో విజయాలు భారత్ ఖాతాలో చేరాయి. అయితే జింబాబ్వేపై ఆడిన ఓ మ్యాచ్‌లో 7 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన జట్టును కపిల్ దేవ్ (138 బంతుల్లో 175 నాటౌట్; 16 ఫోర్లు, 6 సిక్సర్లు) ఒంటి చేత్తో ఒడ్డున పడేశాడు. ఇక 4 మ్యాచ్‌లు గెలిచి సెమీఫైనల్ చేరిన కపిల్ సేన.. సెమీస్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టును 6 వికెట్లతో చిత్తు చేసి ఫైనల్ చేరింది.

క్రికెట్ చరిత్రకు టర్నింగ్ పాయింట్:
జూన్ 25, 1983 ఫైనల్‌కు వెళ్లినా అప్పటికే లీగ్‌లో ఓడించినా సరే.. దుర్బేధ్యమైన లైనప్ ఉన్న డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌తో గెలుపు అంత సులువు కాదని అందరికీ తెలుసు. భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 183 పరుగులకే కుప్పకూలడంతో ఇక ఆశలు లేకపోయాయి. కానీ కపిల్ సేన మాత్రం తమపై నమ్మకం కోల్పోలేదు. అద్భుత ప్రదర్శనతో వెస్టిండీస్ జట్టును 140 పరుగులకే ఆలౌట్ చేసింది. 43 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. ఆ క్షణాన లార్డ్స్ మైదానం భారత అభిమానుల హోరుతో ఊగిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
మలింగ ఆ పద్ధతి మార్చుకో.. లేదంటే కరోనా వస్తది: సచిన్