ప్రతిష్టాత్మక రంజీ క్రికెట్‌లో బెంగాల్ బ్యాటర్ సుదీప్ కుమార్ ఘరామి(596 బంతుల్లో 31 ఫోర్లు, 6 సిక్స్‌లతో 299) తృటిలో ట్రిపుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో ఈ బెంగాల్ బ్యాటర్ ఒక్క పరుగుతో ట్రిపుల్ సెంచరీ ఘనతకు దూరమయ్యాడు.
ఆంధ్ర పార్ట్ టైమ్ బౌలర్ షేక్ రషీద్ బౌలింగ్‌లో సుదీప్ కుమార్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నిరాశగా పెవిలియన్ బాట పట్టిన సుదీప్ కుమార్‌ను ఆంధ్ర ఆటగాళ్లు ఓదార్చారు. ప్రేక్షకులతో పాటు ఇరు జట్ల సపోర్ట్ స్టాఫ్ సుదీప్ కుమార్‌కు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.
భారత క్రికెట్ చరిత్రలోనే ఓ బ్యాటర్ ఒక్క పరుగుతో ట్రిపుల్ సెంచరీ చేజార్చుకోవడం ఇదే తొలిసారి. ఈ దురదృష్టకర ఘనతను సుదీప్ కుమార్ అందుకున్నాడు. ఓవరాల్‌గా మూడో బ్యాటర్‌గా నిలిచాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ క్రోవ్.. 1991లో శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్‌లో 299 పరుగుల వద్ద ఔటయ్యాడు. గ్లామోర్గాన్‌కు చెందిన మైకేల్ పావెల్ కూడా 2006లో గ్లౌసెస్టర్‌షౌర్‌పై 299 పరుగుల వద్ద వెనుదిరిగాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు 295 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రికీ భుయ్(174 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 83) హాఫ్ సెంచరీతో రాణించగా.. శ్రీఖర్ భరత్(47), షేక్ రషీద్(46) హాఫ్ సెంచరీలు చేజార్చుకున్నారు. బెంగాల్ బౌలర్లలో ముఖేష్ కుమార్(5/66) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. ఆకాష్ దీప్(4/79) నాలుగు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీ(1/38) ఒక వికెట్ దక్కింది.
అనంతరం బెంగాల్ 199.1 ఓవర్లలో 629 పరుగులకు ఆలౌటైంది. సుదీప్ కుమార్‌తో పాటు హబిబ్ గాంధీ(229 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 95), సుమంత గుప్తా(167 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 95), మహమ్మద్ షమీ(33 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆంధ్ర బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, త్రిపురణ విజయ్ చెరో వికెట్ తీయగా.. శశికాంత్(2/59), సౌరభ్ కుమార్(2/124) రెండేసి వికెట్లు పడగొట్టారు. షేక్ రషీద్(4/63) నాలుగు వికెట్లు తీసాడు.