టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వికెట్ తీసినందుకు తనను ఫ్యాన్స్ తిట్టినా.. ట్రోల్ చేసినా.. ఆయన మాత్రం మెచ్చుకున్నారని రైల్వేస్ పేసర్ హిమాన్షు సంగ్వాన్ తెలిపాడు. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రంజీ ట్రోఫీ బరిలోకి దిగిన విరాట్ కోహ్లీని హిమాన్షు సంగ్వాన్ క్లీన్ బౌల్డ్ చేసిన విషయం తెలిసిందే. సీనియర్ ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశించడంతో విరాట్ కోహ్లీ.. ఢిల్లీ తరఫున రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అరుణ్ జైట్లీ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. విరాట్ కోహ్లీని చూసేందుకు ఎగబడ్డారు. దాంతో ఈ రంజీ మ్యాచ్ అంతర్జాతీయ మ్యాచ్‌ను తలపించింది.
అయితే కోహ్లీ మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. 15 బంతులు ఆడి ఓ బౌండరీ సాయంతో 6 పరుగులే చేసి హిమాన్షు సంగ్వాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అతను వేసిన ఇన్‌స్వింగర్.. కోహ్లీ బ్యాట్, ప్యాడ్ గ్యాప్ నుంచి దూసుకెళ్లి స్టంప్స్‌ను లేపేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీకి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కోహ్లీని ఔట్ చేసిన హిమాన్షు సంగ్వాన్‌పై అతని అభిమానులు ట్రోలింగ్‌కు దిగారు. కోహ్లీని ఔట్ చేసి హిమాన్షు సంగ్వాన్ గట్టిగా సంబరాలు చేసుకున్నారని, అది సరికాదని మండిపడ్డారు.

తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడిన హిమాన్షు సంగ్వాన్.. ఆ మ్యాచ్ అనంతరం తాను కోహ్లీని కలిసి తాను వికెట్ తీసిన బంతిపై ఆటోగ్రాఫ్ తీసుకున్నానని చెప్పాడు. ఈ సందర్భంగా కోహ్లీ తన బౌలింగ్‌ను మెచ్చుకున్నాడని, మరింత కష్టపడాలని సూచించాడని తెలిపాడు. 'ఆటోగ్రాఫ్ కోసం వికెట్ తీసిన బంతిని కోహ్లీ ఇచ్చాను. వెంటనే అతను ఈ బంతితోనేనా నన్ను ఔట్ చేసింది? అని అడిగారు. అద్భుతమైన డెలివరీ అది. ఇలానే కష్టపడు. నీ భవిష్యత్తుకు బెస్ట్ విషెస్'అని తెలిపాడు.
నా జీవితంలోనే ఇది అత్యంత ముఖ్యమైన వికెట్. విరాట్ కోహ్లీ దేశం మొత్తానికి స్పూర్తిదాయకం. నా జీవితంలోనే ఓ రంజీ మ్యాచ్‌కు మైదానం మొత్తం ప్రేక్షకులు నిండిపోవడం చూశాను. ఇది మాకు చాలా ప్రత్యేకమైన మ్యాచ్.'అని హిమాన్షు సంగ్వాన్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు రెడీ అవుతున్నాడు. గురువారం నాగ్‌పూర్ వేదికగా తొలి వన్డే జరగనుంది.