విరాట్ కోహ్లీ ఫామ్‌పై ఆందోళన వ్యక్తం చేయడాన్ని తప్పుబడుతూ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ ఘాటుగా స్పందించాడు. గంభీర్.. ఓ ఆటగాడిగా కాకుండా హెడ్ కోచ్ అనే విషయాన్ని గుర్తుంచుకొని మాట్లాడాలని చురకలంటించాడు. ఓ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉంటూ ఇలా మాట్లాడటం సరికాదని హితవు పలికాడు.
తానేమీ కోహ్లీని అపహాస్యం చేసేలా మాట్లాడలేదని, గత మూడేళ్లలో అతని సెంచరీల సంఖ్య తగ్గిందని మాత్రమే చెప్పానని వివరణ ఇచ్చాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. రెండు వారాల ముందుగానే సన్నాహకాలు మొదలుపెట్టింది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది.

కోహ్లీ గురించి పాంటింగ్‌కు ఎందుకు
ఈ సిరీస్ నేపథ్యంలో రికీ పాంటింగ్.. కోహ్లీ ఫామ్‌పై ఆందోళన వ్యక్తం చేశాడు. గత మూడేళ్లలో విరాట్ కోహ్లీ మూడు టెస్ట్ శతకాలు మాత్రమే చేశాడని, అతని ఫామ్ ఆందోళన పరిచే విషయమేనని అభిప్రాయపడ్డాడు. ప్రెస్‌మీట్‌లో పాంటింగ్ వ్యాఖ్యలను గంభీర్ ముందు ప్రస్తావించగా ఘాటుగా స్పందించాడు. కోహ్లీ, రోహిత్ ఫామ్‌పై తమకు ఎలాంటి ఆందోళన లేదని చెప్పాడు.
అసలు భారత క్రికెట్‌తో పాంటింగ్‌కు ఏం పని? అని నిలదీసాడు. ఆయన ఆస్ట్రేలియా క్రికెట్ గురించి ఆలోచిస్తే మంచిదని చురకలంటించాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా రికీ పాంటింగ్ స్పందించాడు. తానేమీ కోహ్లీని తక్కువ చేసేలా మాట్లాడలేదన్నాడు.
హెడ్ కోచ్ అనే సోయితో మాట్లాడు..
'విరాట్ కోహ్లీ క్లాస్ క్రికెటర్. వరల్డ్ బెస్ట్ బ్యాటర్. ఇటీవల అతని ఫామ్‌పై నేను ఆందోళన వ్యక్తం చేశా. ఇదే మాటను విరాట్ కోహ్లీ అడిగినా .. అతను కూడా ఇలానే సమాధానం చెబుతాడు. అంతకుముందు వరుసగా సెంచరీలు నమోదు చేసిన అతను.. ఇప్పుడు ఆ స్థాయిలో ఆడలేకపోతున్నాడనేది వాస్తవం. ఇలా చెప్పడం అతన్ని కించపరిచినట్లు కాదు.
గతంలో ఆస్ట్రేలియా గడ్డపై అతను అద్భుతంగా ఆడాడు. ఈ సారి కూడా అతను చెలరేగేందుకు అవకాశం ఉంది. సాధారణంగా గంభీర్ వ్యాఖ్యలకు నేను ఆశ్చర్యపోయేవాడిని కాదు. కానీ, ఓ జట్టు ప్రధాన కోచ్‌గా అతను మాట్లాడిన తీరే ఆశ్చర్యకరంగా ఉంది. గంభీర్ హెడ్ కోచ్ అనే సోయితో మాట్లాడితే బాగుంటుంది.'అని రికీ పాంటింగ్ తెలిపాడు.
ప్రెస్‌మీట్స్‌కు వద్దురా అయ్యా..
టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ప్రెస్‌మీట్‌లో గంభీర్ వ్యవహరశైలిపై మంజ్రేకర్ ట్విటర్ వేదికగా స్పందించాడు. 'ఇప్పుడే గంభీర్ మీడియా సమావేశం చూశాను. ఇప్పటి నుంచి అతన్ని మీడియా సమావేశాలకు దూరం ఉంచడం బెటర్. తెర వెనుక పనిచేసుకోనివ్వండి. రోహిత్‌శర్మ, అజిత్ అగార్కర్.. హాజరుకావడం మంచిది'అని బీసీసీఐని ట్యాగ్ చేస్తూ రాసుకొచ్చాడు.