పంత్, అయ్యర్ కాదు.. అతనే భారత క్రికెట్‌లో రైజింగ్ స్టార్: రవి శాస్త్రి
టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ప్రశంసల జల్లు కురిపించారు. భారత క్రికెట్‌లో శుభ్‌మన్ గిల్ రైజింగ్ స్టార్ అని కొనియాడారు. అతను సుదీర్ఘ కాలం ఆడగలడని చెప్పారు. అతని బ్యాటింగ్ చూస్తేనే ఈ విషయం అర్థమవుతుందన్నారు. ఇంగ్లండ్ పర్యటనతో భారత టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శుభ్‌మన్ గిల్.. అటు బ్యాటర్‌గా.. ఇటు సారథిగా దుమ్మురేపాడు.
ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో 75.40 సగటుతో 754 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీతో పాటు 4 శతకాలు సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై ఒక సిరీస్‌లో 700+ పరుగులు చేసిన తొలి ఆసియా బ్యాటర్‌గా నిలిచాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో అతనికి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు కూడా లభించింది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది జులై అవార్డ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా 2-2తో సమం చేసుకుంది. కెప్టెన్‌గా ఈ పర్యటనలో శుభ్‌మన్ గిల్ సత్తా చాటడంతో మూడు ఫార్మాట్లలో అతన్నే సారథిగా కొనసాగించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో గిల్ గురించి మాట్లాడిన రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'భారత యువ క్రికెటర్లంతా బాగా ఆడుతున్నారు. అయితే రైజింగ్ స్టార్ ఎవరు? అని అడిగితే మాత్రం శుభ్‌మన్ గిల్ అని చెబుతా. అతను సుదీర్ఘ కాలం అద్భుతంగా ఆడగలనని నిరూపించాడు. ఇంగ్లండ్ పర్యటనలో గిల్ ఆడను చూశాం. ఇప్పుడు అతని వయసు కేవలం 25 ఏళ్లే. చాలా భవిష్యత్తు ఉంది. ఇప్పుడున్న అనుభవంతో ఇలాగే కొనసాగితే అతనికి తిరుగుండదు. అతను బ్యాటింగ్ చేసే తీరు చూస్తేనే ఇది అర్థమవుతుంది. అలవోకగా బంతిని ఆడేస్తున్నాడు. భారీ ఇన్నింగ్స్‌లు ఆడేంత సత్తా అతనికి ఉంది.'అని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు.
ఇంగ్లండ్ పర్యటనను విజయంతో ముగించిన టీమిండియా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటుంది. ఆసియాకప్‌తోనే మళ్లీ బరిలోకి దిగనుంది. సెప్టెంబర్ 9 నుంచి 28 మధ్య యూఏఈ వేదికగా ఆసియాకప్ 2025 జరగనుంది. సెప్టెంబర్ 10న యూఏఈతో జరిగే తొలి మ్యాచ్‌తో భారత్ తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో బిగ్ మ్యాచ్ ఆడనుంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం ఆసియా కప్ బరిలోకి దిగే భారత జట్టును ఆగస్ట్ 19న ముంబైలో ప్రకటించే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications